ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ జోరు పెంచింది, దానితో అధికార పార్టీ మంత్రులు బీజేపీ నాయకుల మీద స్వరం పెంచుతున్నారు. తాజాగా వైసీపీ కూడా ఆ పీఎఫ్‌ఐ లాంటి విధ్వంసకర పార్టీ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సత్య కుమార్ వైసీపీపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సత్య కుమార్ అసత్య కుమార్ గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరెవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యకుమార్ బీజేపీకి చెందిన కార్యదర్శిగా కాకుండా, టీడీపీకి చెందిన కార్యదర్శిలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాలని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు.
దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్‌ఐ) ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు చేస్తోందన్న కారణంగా కేంద్రం నిషేధం విధించింది. అయితే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ కూడా ఆ పీఎఫ్‌ఐ లాంటి విధ్వంసకర పార్టీనే అని బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ఆరోపించారు. పీఎఫ్ఐ లాంటి ప్రమాదకర పార్టీ వైసీపీ అని ఆరోపించారు. ఓ ఉగ్రవాద సంస్తతో వైసీపీని అదీ కూడా బీజేపీ జాతీయ స్థాయి నేత పోల్చడం చర్చనీయాంశమవుతోంది. వైసీపీ, పీఎఫ్ఐ రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేనని సత్యకుమార్ చెబుతున్నారు.గృహ నిర్మాణంపై సీఎం ఎన్నిసార్లు సమీక్షించినా పురోగతి లేదని రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. విశాఖలో సీఎం ఇల్లు కడితే విశాఖ అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఇస్తున్న గరీబ్ కల్యాణ్ యోచన పథకం బియ్యాన్ని ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఏపీలో విధ్వంసకర పాలన చేస్తున్న వైసీపీని ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెబుతున్నారు. గడప గడపకూ వెళ్తున్న అధికార పార్టీ నాయకుల్ని ప్రజలు నిలదీస్తున్నారని ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఎందుకు ఉందో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన సత్యకుమార్ సలహా ఇచ్చారు.