అమరావతి రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రను అధికార వైసీపీ నాయకులు తమదైన విధంగా కౌటర్ ఇస్తున్నారు.విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దు అంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే మేం నోరు మూసుకుని కూర్చోవాలా అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.మీరు మా పొట్ట కొడుతుంటే,వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఇళ్ళల్లో పనిమనుషులుగానే మిగిలిపోవాలా అని మంత్రి నిలదీశారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని చంద్రబాబు అండ్ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పు అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో తెలియదా అని ధర్మాన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనతో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడిని దర్శనం చేసుకోండి తప్పులేదు కానీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల పీకకోసే పనిచేస్తామంటే తప్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వారికి చెందిన ఓ వర్గం మీడియా అనేక ఎత్తుగడులు వేస్తోందన్నారు. రైతాంగం పోరాటం చేస్తున్నట్టుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మిగతా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని మీద వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుదీర్ఘమైన చర్చ అసెంబ్లీలో జరిగిందని ఆ సభలో వైసీపీ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన మంత్రిగా అనేక అనుభవాలు, వాస్తవాలను వివరించడం జరిగిందని చెప్పారు.