జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ మంటలు ఇంకా చల్లారలేదు.రోజుకో కొత్త వార్త బయటకు వస్తూనే ఉంది. ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా విశ్లేషణ చేస్తూనే ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుతం చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసినప్పటి నుంచి రోజుకోవార్త వస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను తాము ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని, ఆయనకు ప్రజల్లో ఏ ప్రాంతంలో ఇమేజ్ ఉంటే ఆయనతో ప్రచారం చేయిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బాహాటంగానే ప్రకటించేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరకపోవచ్చని రఘురామ కృష్ణంరాజు హాట్ కామెంట్స్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తే ఆయన కొన్ని వర్గాల అభిమానులను దూరం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆ తప్పు చేయరని భావిస్తున్నానన్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ కీలకంగా మారతారని రఘురామ జోస్యం చెప్పారు.
ఇక జనసేన గురించి తన అభిప్రాయం చెప్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను బీజేపీ వదులుకోదని, పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధిష్టానం పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు.టీడీపీ–బీజేపీ పొత్తు ఉండదని తాను భావిస్తున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు. బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు.