టీడీపీ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల విషయంలో వివాదాలను అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తూనే ఉంది. తాజాగా అన్నా క్యాంటీన్ వివాదం తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తలకు కారణం అవుతోంది. తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. గత నెల 12వ తేదీన ప్రారంభమైన అన్న క్యాంటీన్ ఆదరణ పెరుగుతోంది. మధ్యాహ్నం సమయంలో పెద్ద ఎత్తున పేదలు తరలి వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారు. హఠాత్తుగా క్యాంటిన్ తీసేయాలని రెండు రోజుల క్రితం మున్సిపల్ అధికారులు క్యాంటీన్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ వల్ల మున్సిపల్ మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఐదు రోజుల కిందట వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా ఓ టెంట్ ఏర్పాటు చేసి అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు ఉదయం అధికార వైసీపీ టెంట్‌ను కూడా తొలగించారు. ఆ తర్వాత ఆ రోడ్‌ను పూర్తిగా మూసివేశారు. బారీకేడ్లు పెట్టారు. అంటే వైఎస్ఆర్‌సీపీ క్యాంటీన్‌తో పాటు అన్నా క్యాంటీన్ కూడా తెరవకుండా పోలీసులు చేశారు. ఇదంతా అన్నా క్యాంటీన్‌ను మూసి వేయడానికి పోలీసులు, అధికారులతో కలిసి వైసీపీ నాయకులు ఆడిన డబుల్ గేమ్ అని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. పేదలకు ఓ పూట కడుపు నింపితే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.