ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచనల కామెంట్స్ చేశారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సహిస్తూనే వచ్చానని, ఇకపై సహించనన్నారు.ప్రోటోకాల్ కూడా పాటించకుండా రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అవమానపరిచారన్నారు. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండా కొందరు నాయకులు కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారన్నారు. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వవలసిన గౌరవం కూడా ఇవ్వకుండా ఫ్లెక్సీలలో ఫొటోలు వేయకుండా ఆగౌరవపరిచారన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి.దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఇటీవల చీమకుర్తిలో సీఎం జగన్ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరు కాలేదు. సభావేదికగా ఇరు వర్గాల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల మద్దిశెట్టి, బూచేపల్లి వర్గీయులు దర్శిలో పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ మాట్లాడుతూ…”నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రలేకుండా చేస్తున్నా రు. రెడ్డి సామాజిక వర్గం 90% నా వెంటే ఉందన్నారు. నేను ఎవరి సీటు లాక్కోలేదు. వారు పిలిచి పోటీ చేయమంటేనే చేశాను. ఈరోజు నుంచి దేనికైనా ఊరుకునేది లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను,ఎంత దూరమైనా వెళ్తా అని అన్నారు.
సీఎం ప్రకాశం జిల్లా నిన్న చీమకుర్తిలో పర్యటించారు. అక్కడ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొనలేదు. సభకు రాకపోయినా ఎమ్మెల్యే కనీసం స్వాగతం పలకడానికి హెలిప్యాడ్ దగ్గరకు కూడా రాకపోవడం గమనార్హం. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు కూడా సీఎం ప్రోగ్రామ్ కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే శిద్దా కుమారుడు సుధీర్ మాత్రం హెలిప్యాడ్ వద్దకు వచ్చి సీఎం జగన్ కు స్వాగతం పలికారు.