పోలవరం నిర్మాణంతో జరిగిన పర్యావరణ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుల్లో న్యాయవాదులకు ఫీజులు చెల్లించడంలో ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ,పర్యావరణాన్ని రక్షించడంలో లేదని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క కేసు విచారణకు సీనియర్ లాయర్లను ఎందుకు నియమిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లాయర్లకు ఎంత చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసు ఇస్తామని జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
పోలవరం నిర్మాణం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టానికి రూ.120 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని గతంలో ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత ధర్మాసనం ఎన్జీటీ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతలపై ఇచ్చిన తీర్పులపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇటీవల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున భారీ జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా రూ. 120 కోట్లను జరిమానాగా విధించారు. పురుషోత్తమపట్నంకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిగిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్టీటీ ఆదేశించింది.
సీనియర్ లాయర్లను రంగంలోకి దించి కేసులు వాదించేందుకు తీసుకుంటున్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణలో ఎందుకు లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో లాయర్లకు ప్రభుత్వం ఎంత చెల్లించిందో తెలుసుకునేందుకు అవసరమైతే నోటీసులు ఇస్తామని తెలిపింది. ఎన్‌జీటీ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. పోలవరం, పురుషోత్తమపట్నం, పులిచింతలపై ఎన్జీటీ తీర్పులపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.