ఆంధ్రుల జీవనాడి పోలవరం మీద అధికార, ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. పోలవరం ఆలస్యానికి మీరు కారణం అంటే మీరు కారణం అనుకుంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. తాజాగా పోలవరంపై టీడీపీకి దమ్ముంటే అసెంబ్లి సాక్షిగా చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు రాజకీయ అక్కుపక్షి అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మంత్రి అంబటి పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ చేస్తున్న ప్రచారాలను ఉద్దేశించి మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు గురించి తాను అఢిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే పారిపోయారు, సమాధానం చెప్పే వరకు మళ్లీ మళ్లీ టీడీపీని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. దమ్ముంటే, చేతనైతే అసెంబ్లీలో చర్చిద్దాం రా చంద్రబాబూ అని అంబటి రాంబాబు సవాల్ చేశారు.చంద్రబాబుకు అసలు ఏ రెక్కలు అన్నా ఉన్నాయా, ఆయన కష్టపడటానికి అంటూ సెటైర్లు చేశారు. చంద్రబాబు రెక్కలు ఉన్న ఒక అక్కుపక్షి అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నెల్లూరు బ్యారేజీకి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం విలువ రూ.274.83 కోట్లు రాష్ట్ర విభజనకు ముందు రూ. 86.62 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో, ఐదేళ్లలో రూ. 71.54 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మూడేళ్ల కాలంలో రూ. 77.37 కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీని పూర్తి చేసి, ప్రారంభిస్తే ఇది ఎవరి రెక్కల కష్టం అంటారని అన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు చంద్రబాబుకు ఎవరో ఒకరు రెక్కలు కావాలాని సీపీఎం, బీజీపే, పవన్ కల్యాణ్ రెక్కలు కావాలంటూ ఎద్దేవా చేశారు.