అమరావతి రాజధానికి ప్రభుత్వం ఎంత వ్యతిరేకత తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తుందో అంత సపోర్ట్ కూడా వస్తుంది అని చెప్పక తప్పదు. తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు. ‘‘మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె దిల్లీలోని కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్యపరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది’’ అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. విజయవాడలో ప్రపంచ రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా హైకోర్టు జడ్జి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమృతభారతి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలుగువాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి పునరాలోచన చేసుకోవాలని జస్టిస్ దేవానంద్ అన్నారు. గొప్పగా చెప్పుకోవచ్చుగానీ, ఏం సాధించామని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి లేదన్నారు. ఏపీలో మూడు రాజధానుల వివాదం నెలకొంది. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రతిపాదించింది. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి సుమారు 35 వేల ఎకరాల భూసేకరణ చేపట్టింది. అయితే 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ… మూడు రాజధానులు చేస్తామని ప్రకటించింది. అమరావతి శాసనస రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ప్రకటించింది. అందుకుగాను వికేంద్రీకరణ చట్టం తీసుకొచ్చింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వివాదం మరింత ముదిరింది.