విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ దేశానికి బీజేపీ ఏం చేయకపోగా పేదలను మరింత పేదలుగా మార్చారని మండిపడ్డారు. ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన చీతాలు తెచ్చి ఫోటోలు దిగి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. ఇదేనా మీరు సాధించిన ప్రగతి అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని భవిష్యత్తులో కాంగ్రెస్‌కు పూర్వవైభవం రావటం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లకే పరిమితవుతుందని జోస్యం చేప్పిన చింతా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చింతా ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారన్నారు. జగన్‌ను ఎప్పుడెప్పుడు సాగనంపాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు. చదువులు చెప్పే గురువులను బంట్రోతులుగా మార్చిన ఘనుడు జగన్ మాత్రమేనని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా సంతృప్తిగా పనిచేయటం లేదన్నారు. ఏపీలో విద్య, వైద్య రంగాలను సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందటం లేదని డాక్టర్లు లేకపోవడంతో నర్సులే ఆపరేషన్లు చేస్తున్నారు అని విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను అబద్ధాలప్రదేశ్‌గా మార్చారన్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏపీ అధ్వానస్థితికి చేరిందని అన్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో రైతులు, మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్ పాలనలో ప్రజా రాజధాని అమరావతి మొండి గోడలుగా మిగిలిందన్నారు. పోలవరం నిర్మాణం ముందుకు సాగడం లేదని అన్ని రంగాల్లో ఏపీ అధోగతి పాలైందన్నారు. పేదలు రోజుకు రూ.100 కూడా సంపాదించలేకపోతున్నారని జగన్ సీఎం అయ్యాక ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. పేదలు ఆకలితో నిద్రపోవడం లేదని వాపోయారు. దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే ఏపీలో దాదాపు కోటి మంది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ చెప్పే రాజన్న రాజ్యం ఇదేనా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న జగన్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు.