విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారన్నారు. ఈ ఘటనపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా క్షణికావేశంలో దాడి జరిగినట్లు మీడియాకి తెలిపారు.ఒకరికొకరు ఎదురుపడి, క్షణికావేశంతో కొట్టుకున్నారన్నారు. ప్రత్యర్థులు పిడికిలితో కొడితే, చెన్నుపాటి గాంధీ కన్నుకి గాయం అయ్యిందన్నారు. చెన్నుపాటి గాంధీ ఇన్సిడెంట్ పై విజయవాడ సీపీ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. క్షణికావేశంలోనే చెన్నుపాటి గాంధీపై దాడి చేశారని తెలుస్తోందన్నారు. నిందితులపై 326, 506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని సీపీ తెలిపారు. నిందితులు ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించలేదని వెల్లడించారు. చేతితో కొట్టడం వల్లే కంటికి గాయం అయిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారని కాంతి రాణా చెప్పారు.