వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా తంటాలు పడుతున్నారు. దానిలో భాగంగా వీలు కుదిరినప్పుడల్లా నేషనల్ కాంగ్రెస్ మీద మీడియా వేదికగా మరియు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య అస్త్రాలు సందిస్తోనే ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో నిర్వహించనున్న భారత్ జోడో యాత్రపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు . ఈ పాదయాత్రకు ‘మృత్యువు ముందు తుదిశ్వాస’’ అని పేరు పెడితే బాగుంటుందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమవుతుంది. ఇది 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా 150 రోజులలో 3,500 కిలో మీటర్లు కొనసాగనుంది. ఇతర రాష్ట్రాలు కూడా భారత్ జోడో యాత్ర, సంబంధిత కార్యక్రమాలను ఈ కార్యక్రమం కింద జరగనున్నాయి. రాజకీయ విభజన, ఆర్థిక అసమానతలు, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వం సాగిస్తున్న అధికార కేంద్రీకరణకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిలుస్తుందని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. కొత్తగా ప్రారంభించిన ప్రచార పత్రాలలో కాంగ్రెస్ చిహ్నం ఎందుకు లేదు అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ, యాత్రకు పార్టీ నాయకత్వం వహిస్తున్నప్పటికీ, ఈ యాత్ర పక్షపాతం లేని చొరవ అని చెప్పారు.