కోనా రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానానికి వైసీపీ కి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం ఎన్నికైనట్టు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. కోలగట్ల వీరభద్ర స్వామి ఒక్కరే నామినేషన్ వేసినందుకు ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు సభాపతి తమ్మినేని సీతారాం వెల్లడించారు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్ల వీరభద్ర స్వామిని సభాపతి కుర్చీలో సీఎం జగన్‌తోపాటు ఇతర సభ్యులు వెళ్ళి కూర్చోబెట్టారు. ఆయనకు ఒక్కొక్కరుగా వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పోస్టుకు కోలగట్ల వీరభద్ర స్వామి ఒక్కరే నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఆయన పేరును వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు కోరుముట్ల శ్రీనివాస్, మహీధర్ రెడ్డి ప్రతిపాదించారు. దీనిపై ఇవాళ ఎన్నిక జరిగాల్సి ఉంది. కానీ ఒకే నామినేషన్ పడినందున ఆయన ఎన్నికల లాంఛనమైంది.
డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సభలో చర్చ జరిగింది. ఈ చర్చను వైసీపీ సభ్యురాలు పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఎంతో రాజకీయా అనుభవం ఉన్న వ్యక్తికి రాజ్యాంగబద్దమైన గౌరవాన్ని కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారామె. డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్లను ఎంపిక చేసిన సీఎంకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏ నమ్మకంతో నియమించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టి పేరు తీసుకురావాలన్నారు.
కోలగట్ల ఎంపికను తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. విశేష అనుభవం ఉన్న వ్యక్తిగా సభను సజావుగా నడుపుతారని ఆశించారు ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు. ఇవాళ్టి నుండి రాజకీయ పార్టీలతో కోలగట్లకు సంబంధం లేదని అధికార, ప్రతిపక్షాన్ని సమానంగా చూసి ప్రజాసమస్యలపై చర్చిస్తారని ఆశించారు. స్పీకర్ ఒకవైపే చూస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రెండు వైపులు చూసి అవకాశాలు ఇవ్వాలన్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్లను సీఎం జగన్ అభినందించారు. ఇంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘుపతి రెండున్నరేళ్లుగా పని చేశారని గుర్తు చేశారు. వేరే సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అడిగితే ఆయన అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా అందరికీ న్యాయం చేయాలని ఆశిస్తూ మంచి జరగాలన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా తనను ఎన్నుకున్న వారికి కోలగట్ల వీరభద్రస్వామి కృతజ్ఞత తెలిపారు. ఐదు నెలల క్రితమే నిర్ణయం జరిగిన శాసనసభ సమావేశాలు లేనందున ఆలస్యమైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ తనను ఈ స్థానంలో కూర్చోబెట్టారన్నారు. సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు ప్రవర్తించాలని సూచించారు.