ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత పథకానికి నిధుల ఆమోదానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న సీఎం జగన్ చేయూత నిధులను విడుదల చేస్తారని వారంపాటు మండలస్థాయిలో మహిళలతో చేయూత వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.
తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్ హోటళ్ల నిర్మాణానికి.. ఒబెరాయ్ గ్రూప్‌నకు 30.32 ఎకరాల భూములు మంజూరు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూముల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
సీఆర్డీఏ అభివృద్ధి కోసం 1600 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సీఆర్డీఏ యాక్ట్‌లోని ‘O’ క్లాజ్‌లో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రానికి 1.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానున్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆజాదీ అమృతోత్సవాల్లో భాగంగా ఇప్పటికే క్షమాభిక్ష పెట్టిన 175 మంది ఖైదీలకు అదనంగా మరో 20 మందికి క్షమాభిక్ష పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్ లో 8వ తరగతి చదువుతున్న 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌ల మంజూరును మంత్రివర్గం ఆమోదించింది. ఉపాధ్యాయులనూ కలిపి మొత్తం 5.27 లక్షల మందికి ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో బైజూస్ కంటెంట్, సాఫ్ట్‌వేర్లను జోడించి ఇవ్వనున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. 8, 9, 10 తరగతుల పిల్లలకు అమ్మఒడి పథకం యథాతథంగా కొనసాగుతుందని,సీపీఎస్ రద్దు అంశం కేబినెట్‌లో చర్చకు రాలేదని స్పష్టం చేశారు.
జల్‌జీవన్ మిషన్ అమలు కోసం 4,020 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. గ్రామ సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. గ్రేటర్ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.