టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం స్థానాన్ని ఎలాగైనా ఈ సారి అధికార వైసీపీ చేజిక్కించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల నుండి ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఖరారైంది. కుప్పంలో గెలవాలని చంద్రబాబును ఓడించాలని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల నియోజకవర్గాల వారీ సమీక్షలను కూడా కుప్పంతోనే ప్రారంభించి పార్టీ నాయకలకు భరోసా ఇచ్చారు. అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరతే పోటీ చేస్తారని అందులో సందేహం లేదని పులివెందులలానే కుప్పంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడే కుప్పానికి రూ. 66 కోట్ల విలువైన అభివృద్ధి పనుల మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ పనులకు శంకుస్థాపనలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుప్పం టూర్ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కుప్పం పర్యటనలో భాగంగా మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అప్పుడే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల కోసం సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్తూండటం మొదటిసారి.