రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎయిమ్స్‌కు కనీసం నీరు సరఫరా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా అని నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబు వరుసగా ట్వీట్లు చేశారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న ముఖ్యమంత్రి తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు.మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలి.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.