వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి తండ్రి వైఎస్సార్ కు ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్ విజయమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులు సైతం నివాళులర్పించిన అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తండ్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన తలుచుకుంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ “నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ”ట్వీట్ చేశారు.