అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, విశాఖ అభివృద్ధికి సహకరించకుండా రాజధాని అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతు అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఒక్క ఆధారమైన బయటపెట్టారా అని నిలదీశారు.
“మూడు రాజధానులు సాధ్యం కాదని వైకాపా ప్రభుత్వానికి, సీఎం జగన్ కు తెలుసు,అయినా మూడేళ్ల క్రితం వేసిన క్యాసెట్టే మళ్లీ వేస్తున్నారు. విశాఖపట్నంలో రాజధాని పెడతామన్నారు ఎందుకు? అక్కడ కొత్తగా ల్యాండ్ స్కామ్ లు చేయాలనా? విశాఖపట్నం అభివృద్ధికి అనేక సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. కానీ, అలా జరగట్లేదు. నిజమైన అభివృద్ధి కావాలంటే వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం ఎందుకు నత్తనడకన నడుస్తోంది” అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జీవీఎల్ నిలదీశారు.