జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి తెలుగు వాడు అవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకించిన, అనేక విధాలుగా ప్రయత్నించిన జగన్ ఆయనతో వేదిక పంచుకోవడమే కాకుండా ఆయన్ని పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. వివిధ కారణాలతో ముఖ్యంగా సామాజిక వర్గం కారణంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ను, ఆయన నియామకాన్ని సీఎం జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు.
విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాలను ఈ ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర సీఎం జగన్ తో కలిసి ఆయన న్యాయస్థానాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం హైకోర్టు సీజే సీఎం జగన్ కలిసి నూతన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు వాటిని తానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు.’విజయవాడలో నూతన జిల్లా కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సీజేఐ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. 2013లో జస్టిస్ ఎన్. వి. రమణ చేతులమీదుగా భూమిపూజ జరిగింది. నిర్మాణాల ప్రారంభోత్సం కూడా ఆయన చేతులమీదుగానే జరిగింది. ఇది గుర్తుండిపోయే ఘట్టం. న్యాయవ్యవస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. న్యాయవ్యవస్థకు చెందిన ప్రతి విషయంలో సహకారానికి సిద్ధం’ అని సీఎం జగన్ ప్రకటించారు.
అంతకుముందు నోవాటెల్ హోటల్ లో సీజే రమణ ను సీఎం జగన్ కలుసుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయూర్తిగా రమణ గారిని వ్యతిరేకించిన జగన్ అదే నోటితో ఆయన్ని పోగడవలసి రావడం యాదృచ్ఛికం.