బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు సిల్వర్ మెడల్ ని గెలుచుకుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత బ్యాడ్మింటన్ జట్టును అభినందించారు. “వారు ప్రదర్శించిన నైపుణ్యాలు, టీమ్ వర్క్, పోరాట పటిమ చాలా గొప్పవని” అని ట్వీట్ చేశారు. మంగళవారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత్ 1-3తో మలేషియా చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవడంతో కిడాంబి శ్రీకాంత్ అత్యద్భుత ప్రదర్శన ఇచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌లను ఫైనల్‌లో వెనక్కి నెట్టడానికి ప్రయత్నించిన శ్రీకాంత్ మూడు గేమ్‌లలో తక్కువ ర్యాంక్‌లో ఉన్న Tze Yong Ng చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు ఊహించిన విధంగానే రాణించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఓపెనింగ్ డబుల్స్‌లో ఓడిపోయింది.
అలానే నిన్న భారత్‌కి నాలుగో బంగారు పతకం లభించింది. మహిళల లాన్ బౌల్స్ ఈవెంట్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడిన భారత మహిళల టీమ్ 17-10 తేడాతో విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్‌కి లాన్ బౌల్స్‌లో పసిడి పతకం రావడం ఇదే తొలిసారి. మహిళల ‘ఫోర్’ టీమ్‌లోని పింకీ, రూపా రాణి, నయన్‌మోని, లవ్లీ చోబీ ఈరోజు ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఎండ్-7 టైమ్‌కే భారత్ 8-2తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. దాంతో ఎండ్-12కి వచ్చేసరికి 10-10తో స్కోర్లని దక్షిణాఫ్రికా సమం చేసింది. ఆ జట్టు పుంజుకున్న తీరుతో కాసేపు భారత శిబిరంలోనూ కంగారు కనిపించింది. కానీ చివర్లో పుంజుకున్న భారత్ టీమ్ దక్షిణాఫ్రికా తేరుకునేలోపే 17-10తో పసిడిని కైవసం చేసుకుంది.