మూడు సంవత్సరాలగా అటకెక్కిన పథకానికి బూజు దులిపి మళ్ళీ పట్టా లెక్కిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయానికి సంబంధించిన “Y.S.R పెళ్లికానుక” పథకాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. రెండేళ్ల క్రితమే ఈ పథకం మీద GO ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత YSR కల్యాణమస్తు, షాదీ తోఫా పేరిట అమల్లోకి తీసుకురానుంది జగన్ సర్కార్.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 సెప్టెంబర్ 16న Y.S.R. పెళ్లికానుక పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు పెంచిన సాయాన్ని అందిస్తానని GO ఇచ్చారు. 2020 ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి తెస్తామని ప్రభుత్వం తెలిపింది. 2019 సెప్టెంబరులో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పథకానికి ఆమోదముద్ర కూడా వేశారు. 750 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ కరోనా వ్యాప్తిని కారణంగా చూపుతూ పథకాన్ని అమలు చేయలేదు. తెలుగుదేశం హయాంలో ముస్లింలకు అమలుచేసిన దుల్హన్ పథకం నిలిపివేయడంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా డబ్బులు లేకపోవడంతోనే పథకాన్ని నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది.
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో, కళ్యాణమిత్రల భవితవ్యంపై నీలినీడలు అలముకున్నాయి. వీరికి ఇచ్చే ప్రోత్సాహకాలు రెట్టింపు చేస్తానని జగన్ ప్రకటించారు. వైకాపా అధికారం చేపట్టిన ఏడాది పాటు పనులు చేయించుకుని ఒక్క పైసా చెల్లించకుండా అన్యాయం చేశారు. దాదాపు 18 వందల మంది కల్యాణమిత్రలకు 4కోట్లకు పైగానే ప్రోత్సాహక సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఇక 2019-20లో వివాహాలు చేసుకున్నవారి నుంచి 60 వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించినా ఒక్క పైసా డబ్బులు విదల్చలేదు. గత ప్రభుత్వంలో కొనసాగిన ఆర్థికసాయం ప్రకారం అంచనా వేసినా వీరికి 316 కోట్లు చెల్లించాలి. కొత్త సాయం ప్రకారమైతే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
మూడేళ్లుగా పథకాన్ని పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం YSR కల్యాణమస్తు, షాదీతోఫా పేరిట అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం అమలు చేయనున్నట్లు GO లో పేర్కొంది. కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు ఇదే వర్గంలో కులాంతర వివాహాలకు లక్షా 20 వేలు అందజేయనున్నారు. బీసీలకు 50వేలు, వీరిలో కులాంతర వివాహాలకు 75వేల సాయం చేయనున్నారు. మైనార్టీలకు లక్ష, దివ్యాంగుల వివాహాలకు లక్షన్నర అందించనుండగా భవననిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులకు 40వేల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.