తెలంగాణలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసర నుంచి భద్రాచలం, పోలవరం మీదుగా ధవశేశ్వరం వరకు గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. భద్రాచలం వద్ద 50.90 అడుగులు ఉన్న నీటి మట్టం 53 అడుగులు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆపై మరో 4 గంటల వ్యవధిలోనే రాత్రి 7 గంటలకు నీటిమట్టం అడుగున్నర మేర పెరిగి 54.80 అడుగులకు చేరింది. తెలంగాణలో పలు ప్రాజెక్టుల నుంచి భారీగా వస్తుడటంతో భద్రాచలం వద్ద 66 అడుగుల నీటి మట్టం నమోదకావొచ్చిని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది.
బ్యారేజీ నుంచి 15,69,011 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ, జిల్లాల కలెక్టర్లకు సూచనలిస్తున్నారు.6ఎన్డీఆర్ఎఫ్
నరసాపురం పట్టణంలోకి నీరుపశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి, నందమూరి కాలనీ, నవరసపురం గ్రామ ఎస్టీ కాలనీలోకి నీరు చేరింది. రెండో రోజూ రేవులో రాకపోకలు నిలిచిపోయాయి. చేపల వేట నిషేధించడంతో పడవలన్నీ రేవుకు చేరాయి. మురుగు డ్రెయిన్లకు వరద రావడంతో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంటలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నారు. పెద్లమల్లం మాచేనమ్మ ఆలయం చుట్టూ నీరు చేరింది. జలదిగ్బంధంలోని గ్రామాలను కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే వెళ్లి పరిశీలించారు.
కోనసీమ లంకలను ముంచెత్తుతున్న వరదకోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరద ముంచెత్తుతోంది. నదీతీర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు స్వచ్ఛందంగా తరలివెళుతున్నారు. వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గురువారం నాటికి గోదావరి మహోగ్ర రూపం దాల్చే ప్రమాదముందన్న జలవనరుల శాఖ అధికారుల హెచ్చరికలతో కోనసీమ ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. అయినవిల్లి మండలం యలకల్లంక, సమీప రైతులు లంకలో ఉండడంతో వారిని తీసుకువచ్చేందుకు వెళ్లిన బోటుకు సాంకేతికపరమైన సమస్య తలెత్తింది. దాంతో చిమ్మ చీకటిలో సుమారు ఇరవై మంది రైతులు చిక్కుకుపోయారు. రాత్రివేళ మరో బోటును పంపారు. ఎదుర్లంక గోదావరి వంతెనపై నుంచి 22 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. కేశనకుర్రు చినచెరువుగట్టుకు చెందిన వరసాల ఆదినారాయణ బహిర్భూమికి వెళ్లి ఫిట్స్ రావడంతో గోదావరి నీటిలో పడి మృతి చెందాడు. ఏనుగుపల్లి, అప్పనపల్లి, ముక్తేశ్వరం, కనకాయలంక, అప్పనరామునిలంక ప్రాంతాల్లో కాజ్‌వేలు నీట మునగడంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
పోలవరాన్ని ముంచెత్తిందిపోలవరం ప్రాజెక్టు ఎగువన నీటిమట్టం మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి స్పిల్ వే, కాపర్ డ్యాం ఎగువన 34.29 మీటర్లు, స్పిల్‌వే దిగువన, కాపర్ డ్యాం వద్ద 25.99 మీటర్లు, పోలవరంలో 24.717 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా 14,74,907 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. కడెమ్మ వంతెన నీట మునిగి పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు బంద్ అయ్యాయి.
గోదావరి వరద ఉధృతితో ముంపు మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏడు నిర్వాసిత గ్రామాల్లోని 1,112 కుటుంబాల్లోని 3,780 మంది నిర్వాసితులను తరలించారు. వైసీపీ, టీడీపీలు కూడా నిర్వాసితులను తరలించడానికి ట్రాక్టర్లు ఏర్పాటు చేశాయి. కొవ్వూరు మండలం మద్దూరులంకలోని పల్లిపాలెంను అధికారులు ఖాళీ చేయించారు. కోనసీమ జిల్లాలో 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 1,100 మందికి భోజన వసతి కల్పించారు. 37 వరద ప్రభావిత గ్రామాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
లంక గ్రామాల్లో సహాయక చర్యలకై ఇప్పటికే 6 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో ఉన్నాయి. లోతట్టు, లంక గ్రామాల ప్రజల సహాయార్ధం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్స్, ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.