కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా మరింత నష్టాల్లో ఉందని ఆరోపించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్. ముందస్తు ప్రణాళిక లేకుండా, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం లేకుండా తీసుకున్న జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా 7 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ విషయం మీద సీఎం జగన్‌కు లెటర్ రాశారు.
పర్యావరణంపై మీరు ప్రేమ ఒలకబోయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని ఎద్దేవా చేశారు లోకేష్. ఒక పక్క మీరు ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నారని ఆరోపించారు. విశాఖలో పచ్చని రుషి కొండని బోడికొండగా మార్చారు వైసిపి పార్టీ నేతలు. ఫ్లెక్సీ పరిశ్రమపై నిషేధం విధించేందుకు చూపించిన వేగం వైసిపి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాని అరికట్టడంలో చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 1500 ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయని. వీరంతా సుమారుగా 10 నుంచి 30 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టారని లోకేష్ తెలిపారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కొంతమంది అప్పులు చేసి కొంతమంది ఈ యూనిట్లను నెలకొల్పారని గుర్తు చేశారు. నెలవారీ EMI కట్టడమే కష్టం అవుతున్న ప్రస్తుత తరుణంలో మీరు తీసుకున్న నిర్ణయం వీరిని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు.