జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ఆర్థిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇవి తమకు కూడా వర్తిస్తాయని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు భావించారు. ఈ విషయంపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో క్లారిటీ ఇచ్చింది.
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్. ఎస్. రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తించదు. ఆయా సంస్థలు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు అని ఉత్తర్వులు ఇవ్వడం తగదని ఈ కంపెనీలకు రాష్ట్ర ఆర్థికశాఖ సూచించింది.
ఏపీ ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థల్లో పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి ఉత్వర్వులు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తాజా ఉత్తర్వులలో ఆర్థికశాఖ పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రిటైర్మెంట్ వయసు పెంపు ఉత్వర్వులకు సంబంధించి నివేదికను పంపాలని కూడా అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.