అధికార వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైఎస్సార్సీపీ మీద హాట్ కామెంట్స్ చేసారు.ఏపీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మూడు రాజధానులు అని మంత్రులు మాట్లాడుతున్నారని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రైతులు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని .. వారి పాదయాత్రపై కుట్ర చేస్తున్నారన్న అనుమానాలున్నాయని అలజడి సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని లేఖలో అమిత్ షాను రఘురామకృష్ణరాజు కోరారు.
సెప్టెంబర్ నెల పదిహేనో తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టబోతోందన్న ప్రచారం మీద రఘురామ కృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా బిల్లు ప్రవేశ పెడితే అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ గోపాల గౌడ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు.
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది, న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బ తగిలినా మూడు రాజధానుల బిల్లు పెడతామని చెబుతున్నారు అని అన్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే మూడు రాజధానులు పెట్టుకోవడానికి న్యాయపరమైన అడ్డంకులు ఉండవని చెబుతున్నారు. కానీ ఏపీ మాత్రం మూడు రాజధానుల బిల్లు తెచ్చే ప్రయత్నంలో ఉండటం బాధాకరం అన్నారు.