ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1000 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులు ఈ రోజు నుండి అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది. దానిలో భాగంగా రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతులు ఎక్కడా సంతోషంగా లేరని అభిప్రాయపడ్డారు. గతంలో తిరుమల పాదయాత్రకు మద్దతిచ్చామని ఇప్పుడు అరసవల్లి పాదయాత్రకు కూడా జనసేన కార్యకర్తలు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు.
అమరావతి రైతులతో 10నిమిషాలు మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతులకు భయపడి రాజధాని ప్రాంతాల్లో పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక రాజధానే కట్టలేని జగన్ మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. సోమవారం వెంకటపాలెంలో మొదలయ్యే యాత్ర కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. కృష్ణాయపాలెం వద్ద యాత్రలో పాల్గొనున్న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు రాజధాని అమరావతి 29 గ్రామాలకే పరిమితం కాదని, యావత్తు రాష్ట్ర ప్రజల సొత్తు అని ఐకాస నాయకులు, రైతులు స్పష్టంచేస్తున్నారు.