తెలుగులో రిలీజ్ అయ్యి దేశాన్ని ఒక ఊపు ఊపేసిన పుష్ప సినిమాలో ఫేమస్ డైలాగ్ “తగ్గేదే లే”. ఈ డైలాగ్ ను ఆదర్శంగా తీసుకొని తమ నిర్ణయం పట్ల ఏపీ ఉద్యోగులు తగ్గేదేలేదంటున్నారు. ఈనెల 11న విజయవాడలో తలపెట్టిన శాంతియుత నిరసనకు ముందుస్తు గా గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎస్ రద్దుకోసం డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దుచేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు.
అప్పట్లో సీఎం జగన్ హామీని నమ్మితామంతా ఓట్లు వేశామని, మూడేళ్లవుతున్నా ఇప్పటికీ సీపీఎస్ రద్దు చేయకుండా GPS అంటూ తెస్తున్న కొత్త విధానాన్ని ఒప్పుకునేది లేదు అంటున్నారు ఉద్యోగులు. సీఎం జగన్ తండ్రి వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, వారికి అన్నివిధాల ఆయన మేలు చేకూర్చారని, జగన్ కూడా అదే బాటలో నడవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ప్రదర్శన చేపట్టి, ఏపీజేఏసీ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకోసం నినాదాలు చేశారు.
సెప్టెంబర్ 1న జరగాల్సిన చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చినట్టుగానే సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం మాత్రం సీపీఎస్ రద్దు కుదరదని, అప్పట్లో తెలియకుండానే ఈ హామీ ఇచ్చామని ఇది రద్దు చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటోంది. దీనికి బదులు ఉద్యోగులకు ఫలప్రదమైన GPS ఇస్తామంటూ చర్చలకి రమ్మంటోంది.