విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే జోన్ విషయంలో ఎలాంటి ఊహాగానాలు తావు ఇవ్వవద్దు అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని దానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గతంలో స్థలం ఎక్కడ దొరుకుతుందనే సందిగ్ధం నుంచి బయటపడి డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన స్థల ఎంపిక జరిగిందని అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎంపికలు అన్ని పూర్తయ్యాయని, కార్యాచరణలోనే ఉంది అని తెలిపారు. కేబినెట్ భేటీ నిర్ణయాలు వెల్లడించే సమయంలో అశ్వినీ వైష్ణవ్ వైజాగ్ జోన్ ఏర్పాటు వివరాలు వెల్లడించారు.”జోన్ ఏర్పాటుకు డీఆర్‌ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశాం. రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జోన్ ఏర్పాటుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. విశాఖ జోన్ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతాం అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రైల్వేజోన్ అనేది రాజకీయపరమైన నిర్ణయమని, రైల్వేజోన్ అంశం రెండు రాష్ట్రాలకు చెందిన సమస్య కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రైల్వేజోన్‌కు రాష్ట్ర మంత్రివర్గం తమ అభిప్రాయం ఇచ్చిందని డీపీఆర్ తయారైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వోజోన్ పనులకు కొంత భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే రైల్వేజోన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు.త్వరలోనే విశాఖకు రైల్వే జోన్ వస్తుందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై ఎలాంటి వివాదాలూ లేవని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఉందన్నారు.