దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్ లో సోమవారం భారత్ తొలి స్వర్ణ పతకాన్ని అందుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ ని సాధించాడు అర్జున్ బబూటా. ఇక ఫైనల్స్ లో అతడు టోక్యో ఒలింపిక్స్ రజత పతాక విజేత అమెరికాకు చెందిన కోజెనెస్కి ఘన విజయం సాధించాడు. ఫైనల్లో అతడు 17 – 9 తో కోజెనెస్కిని ఖంగు తినిపించాడు. టోర్నీలో భారత్ కు ఇదే తొలి పతకం కావడం విశేషం. సీనియర్ లెవల్ టోర్నీల్లో అర్జున్ కు కూడా ఇదే తొలి బంగారు పతకం. 2016లో అజర్ బైజాన్ వేదికగా జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ లోనూ అర్జున్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. అంతకుముందు జరిగిన రౌండ్ లో అర్జున్ 261.1 పాయింట్లు సాధించి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించాడు. 260.4 పాయింట్లు సాధించిన కొజెనెస్కీ రెండో స్థానంలో నిలిచాడు.
మూడో స్థానంలో ఇజ్రాయిల్ కు చెందిన సెర్గె రిచెర్ 259.9 పాయింట్లతో నిలిచాడు. టాప్ 2లో నిలిచిన అర్జున్, కొజెనెస్కీ పసిడి పతకం కోసం పోటీ పడ్డారు. అక్కడ అర్జున్ విజయం సాధించాడు. ఫలితంగా భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. ఇక అంతకుముందు శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో 53 మంది పాల్గొన్నారు. ఒక్కో షూటర్ 60 రౌండ్ల పాటు షూటింగ్ చేసే అవకాశం ఉటుంది. ఈ క్వాలిఫయింగ్ రౌండ్ లో 630.5 పాయింట్లు సాధించిన అర్జున్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. అదే సమయంలో 628.4 పాయింట్లు సాధించిన పార్థ్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ కు చేరుకున్నాడు. ఈ రౌండ్ లో ఇజ్రాయిల్ షూటర్ సెర్గె టాప్ లో నిలిచాడు. అయితే ఫైనల్లో మాత్రం పార్థ్ అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. టాప్ 3లో నిలువలేకపోయాడు. దాంతో అతడు పతకం లేకుండానే రిక్త హస్తాలతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ను ముగించాడు.