ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీని ప్రశ్నించిన వారికి అయితే అధికార పార్టీ నుండి లేదా ప్రభుత్వం నుండి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత అంశంలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంకబాబును గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. అంకబాబు అక్రమ అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. వాట్సప్ లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణంగానే అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమ కేసులు, అరెస్టులతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్టును అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుందని మండిపడ్డారు.
వెంటనే అంకబాబును బేషరుతుగా విడుదల చేయాలని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.అరెస్టుకు ముందు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీకి తెలియదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన న్యాయస్థానం ఆదేశాలను పక్కనబెట్టి సమాజ విధ్వంసకుడు జగన్ రెడ్డి ఆదేశాలను సీఐడీ పాటించడం సిగ్గుచేటని విమర్శించారు.