మాజీ ఐఏఎస్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కీలక వ్యూహాలు వేస్తుంది.వారి అనుభవాన్ని ఉపయోగించి అధికార ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దానిలో భాగంగా ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీలో ప్రధాన ప్రజా సమస్యలు గుర్తించి, ఉద్యమ కార్యాచరణ రూపొందించే పని ఆయనకు భారతీయ జనతా పార్టీ అప్పగించింది. ఇందు కోసం ఆయన్ను కన్వీనరుగా నియమించింది. ఆయనతో పాటు మరో మరో ఎనిమిది మందితో దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 నుంచి 30 ప్రాంతాల్లో వీధి సమావేశాలు, బహిరంగ సభలు జరపనున్నాయి.
వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందంటోన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటి ప్రజలకు వివరించే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తోంది. రాష్ట్రం దుస్థితిని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల వీధి సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. వైసీపీ వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటుతున్నా ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలో నడిపే సత్తా, ఆలోచన, ప్రణాళికలు లేవని బీజేపీ అంటోంది.