గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే లకు అక్కడక్కడా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎన్నో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఎప్పటిలాగే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో శనివారం ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది.
కొండన్న గారి శివయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి పర్యటించారు. అక్కడ ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన టీడీపీ జెండాను చూసి ‘‘మేం వస్తున్నామని జెండాలు కట్నారా ఏమి’’ అని కేతిరెడ్డి సరదాగా అన్నారు. అలా కొండన్న గారి శివయ్య కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి వ్యక్తిగతంగా లభించిన లబ్ధి వివరాల బ్రోచర్ ను ఎమ్మెల్యేకు ఇవ్వబోయారు. అయితే ‘నీ పథకాలు అవసరం లేదు’ అంటూ శివయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ముఖంపైనే తిరస్కరించారు. దీంతో కేతిరెడ్డి తీసుకోమని మరోసారి కోరారు. అయినా వారు వినకపోవడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు.
ఈ ఘటన మీద వైసీపీ ఎంపీ విజయసాయం రెడ్డి ట్వీట్ చేయగా, అందుకు కౌంటర్ గా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. తమకు సంక్షేమ పథకాలే వద్దని ఆ కుటుంబంలోని వారు తెగేసి చెప్పగా ఇప్పటిదాకా వారు పొందిన లబ్ధి వివరాలను ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ కు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు.వైఎస్ మదన్ మోహన్ రెడ్డికి, జగన్ వదిన వైఎస్ మాధవీలతకు టీడీపీ హయాంలో రైతు రుణమాఫీ అయ్యిందని చింతకాయల అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. వైఎస్ మధు అకౌంట్ నెంబర్ 045213100036589 లో రెండు విడతలుగా రూ.63 వేలు, 3వ కంతుగా (విడత) రూ.36 వేలు జమ అయ్యాయని తెలిపారు. అలాగే వైఎస్ మాధవీలత అకౌంట్ నెంబర్ 045213100036613 లో రెండు కంతులుగా రూ.59,643, మూడో కంతుగా రూ.34,081 వైసీపీ ఎమ్మెల్యేకు కూడా రుణమాఫీ అయ్యింది. మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. మా హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని మ్యాచ్ చేయడం మీతరం కాదు విజయసాయ రెడ్డి అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.