రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చేతకాని విధానాలను విడనాడాలని, ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. 3 రాజధానుల విషయంలో తగ్గేదే లేదని మంత్రులు బీరాలు పోతున్నారని ఇదంతా ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, రాష్ట్ర రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేదే కాంగ్రెస్ విధానమని విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ వివరించారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారని, ఈలోపే చంద్రబాబుతో ఏం గొడవ వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ వాసులుగా తమకు అప్పుడు ఇబ్బంది అనిపించినా రాష్ట్ర ప్రజల మేలు కోరి అమరావతికి అండగా నిలిచామని వెల్లడించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ప్రజల్లో, రోడ్లపై తిరిగితే వాస్తవం తెలిసేదని శైలజానాథ్ అన్నారు. శ్రీభాగ్ ఒప్పందంపై ముఖ్యమంత్రి జగన్‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్‌కు అన్ని విధాలుగా మంచిదని హితవుపలికారు. సీఎం జగన్ ఇప్పటికైనా తన మొండి పట్టుదలను వీడాలన్నారు.