ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థికవేత్తలు, మేధావులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక వేత్తలు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక నిర్ణయాలు, అప్పుల మీద ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గానీ, వారి పార్టీ నాయకులు గానీ వినింది లేదు సరికదా ఎదురు దాడి చేసేవారు. కేంద్రప్రభుత్వం కూడా కొంత వ్యూహాత్మక మౌనం పాటించడం వల్ల వారి సహకారం ఉంది అని సామాన్య ప్రజలు అనుకొనే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయి దాటి పోయాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక నిర్ణయాలు హద్దు దాటడంతో కేంద్ర ఆర్థిక శాఖ నుండి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి కి వచ్చి వివరణ ఇవ్వాలని కబురు అందింది.
కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ “రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ను తగ్గించి, దాన్ని స్పెషల్ మార్జిన్ పేరిట ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్ని తాకట్టు పెట్టి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రుణాలు సేకరించడం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)ను ఉల్లంఘించడమేనని, అలాగే వివిధ ఆర్ధిక పరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమీ బాగా లేదని, వాటిపై చర్చించడానికి ఈ నెల 25వ తేదీన దిల్లీకి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి 22న లేఖ రాశారు.
ఆ లేఖలో సామాజిక, ఆర్థిక కార్యక్రమాల అమలు కోసం ఏపీఎస్‌బీసీ ద్వారా ఈ జూన్‌లో 9.62% వడ్డీతో రూ.8,305 కోట్ల విలువైన బాండ్లు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ ద్వారా వీటిని జారీ చేసినట్లు మాకు తెలిసింది.ఒకప్పుడు వివిధ మద్యం రకాలపై వ్యాట్ 130% నుంచి 190% వరకు ఉండేది. 2021 నవంబరులో దాన్ని 35% నుంచి 60% వరకు తగ్గించినట్లు తెలిసింది. తగ్గించిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా, అదనపు స్పెషల్ మార్జిన్ పేరిట పాత MRP ని అలాగే కొనసాగిస్తూ జీవో విడుదల చేసింది. ఇలా విధించిన స్పెషల్ మార్జిన్‌ను ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమెండ్‌మెంట్ యాక్ట్-2022 ద్వారా 2021 నవంబరు 9 నుంచి APSBCLకు అప్పగించారు.జగన్ ప్రభుత్వం మద్యంపై సుంకాన్ని ప్రత్యేక మార్జిన్‌గా మార్చి దానికి కార్పొరేషన్ ఆదాయంగా పేరుపెట్టింది. సంక్షేమ పథకాల అమలుకోసం ఆ మార్జిన్‌ను తాకట్టుపెట్టి ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా రుణాలు తీసుకుంది. ఇలా చేయడం ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) కింద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నికర రుణ పరిమితిని బైపాస్ చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెన్‌కోలు కాకుండా మిగిలిన విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు ఏపీ రూ. పది వేల కోట్ల బకాయి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పునరుత్పాదక ఇంధన సంస్థలు, స్వతంత్ర విద్యుత్తు సంస్థలూ ఉన్నాయి. వివిధ డిస్కంలకు రాష్ట్రం నుంచి రూ.తొమ్మిది వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అలాగే సబ్సిడీల రూపంలో ఇచ్చిన రూ.3,178 కోట్ల బకాయిలనూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అవి ఎప్పుడిస్తారు? అని లేఖలో ప్రశ్నించారు. వీటి మీద సమాధానం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ, ఎంపీ విజయసాయిరెడ్డి, మరో 10 శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు