దేశవ్యాప్తంగా అనేక కీలక కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించి నిందితులకు శిక్షలు పడేటట్లు చేసే సంస్థ సీబీఐ. అటువంటి సీబీఐ అంటే ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలు కూడా హడలిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు పిలిస్తే దర్యాప్తు అధికారి, సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ప్రైవేటు ఫిర్యాదులు చేస్తున్నారని సీబీఐ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ASG) హరినాథ్ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డిలు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని ఠాణాకు రిఫర్ చేసింది. రిమ్స్ ఠాణా పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 195ఏ, 323, 506, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఏదన్నా కేసుకు సంబంధించి కింది కోర్టు ఇచ్చిన తీర్పు దస్త్రాలు కనిపించకుండా పోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. న్యాయస్థానంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ శాఖల అధికారులను ఎలా ప్రశ్నించగలమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదయ్యేలా చూడాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది.