– రోజుకో ప్రశ్నపత్రం లీక్
– సమాధానం ఇవ్వలేని అధికారులు
– ఆవేదనలో విద్యార్థులు
– చర్యలు తీసుకోవాలంటున్న తల్లితండ్రులు
ప్రశ్నపత్రాల లీకేజ్ ఎలా అవుతోంది. దానికి కారణం ఏమిటి.. అసలేం జరుగుతోంది. ? కరోనా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు అంటే రెండేళ్ల పాటు విద్యార్థులకు పరీక్షలనేవి జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉండాలి. చాలా కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులకు సరైన మార్గనిర్దేశకాలు ఇవ్వాలి. కానీ అదే జరిగితే రోజుకో పేపర్ ఎందుకు వాట్సాప్ లో ప్రత్యక్షమౌతుంది. ఈ విషయాలని అడిగితె మాత్రం అలాంటిదేం లేదు అంటూ అధికారులు సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు.
ఇలా ప్రశ్నపత్రాలు లీక్ అవుతుంటే కస్టపడి ఫీజులు కట్టి, ట్యూషన్స్ కి వెళ్లి రాత్రిబవళ్ళు చదివిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి.. చదివిన వాళ్ళు చదవని వాళ్ళు కూడా ఒకటై పోతున్నారు. పరీక్ష మొత్తం పూర్తయ్యాక బయటకు రావాల్సిన ప్రశ్నపత్రాలు ముందుగానే ఎలా ప్రత్యక్షమవుతున్నాయి అనే ప్రశ్నకు ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఈ విషయాన్నీ తల్లితండ్రులు ప్రస్తావిస్తుంటే మాత్రం అది పేపర్ లీక్ కాదు మాస్ కాపీయింగ్ అని చెప్పి తప్పించుకుంటున్నారు. పేపర్ లీక్ అంటే ఘోరం అనుకుంటే మాస్ కాపీయింగ్ అనేది ఇంకెంత నేరం..
అధికారులకు ఇవేమీ పట్టడం లేదు. వాళ్ళ వ్యవహారశైలితో విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదనకు గురౌతున్నారు. 8 ,9 తరగతులు చదవకుండానే 10 తరగతికి వచ్చిన విద్యార్థులు ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా 6 . 22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. రోజుకో లీకు వ్యవహారం బయటికి వస్తుంటే కస్టపడి చదివిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్ల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరేనా అంటూ తల్లితండ్రులు పిల్లల్ని సముదాయించలేక వాళ్ళకి వాళ్ళు సర్దిచెప్పుకోలేక సతమవుతున్నారు. స్క్వాడ్స్, సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్ ఇలాంటి సిబ్బంది పకడ్బందీగా ఉంటారు. కానీ ఎందుకు ఇంకా ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయి, అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. ఆ .. ఏం చేస్తారులే, ఏం అవుతుందిలే అనే ధీమాకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టి కఠిన శిక్షలు అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి.