పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను తెలియజేసిన అభిప్రాయాలూ, ప్రజాసమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2014 మార్చి 14న జనసేన అవతరించింది. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో జనసేన పార్టీ భారీ ఎత్తున ఆవిర్భావసభ నిర్వహించింది. ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వరకూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో సిద్ధం చేసింది జనసేన పార్టీ మీడియా విభాగం. ఏడు వాల్యూమ్స్ లో ఉన్న ఈ పుస్తకాలను హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ అవిష్కరించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పార్టీ ఎదుగుదలను తెలియచేసేలా ఏడు సంకలనాలతో కూడిన జనసేన ప్రస్థానం పుస్తకాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో జనసేన పార్టీ ఎంతగా ప్రజలతో మమేకమైంది, ప్రజా సేవకు చిత్తశుద్ధితో అంకితమైంది తెలియచేస్తున్నాయి. ప్రతి జిల్లాల్లో మాట్లాడినవి స్థానిక సమస్యల నుంచి, రాష్ట్రస్థాయిలో సమస్యల వరకూ ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియచేస్తున్నాయి” అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగంలోని సభ్యులకు అభినందనలు తెలియచేశారు.