మే 26న నుంచి కొత్త పాన్ కార్డ్ రూల్ అమల్లోకి వస్తోంది. ఇప్పటికే ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డ్ వివరాలు వెల్లడించడం తప్పనిసరి అనే రూల్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రూల్‌లో యాన్యువల్ లిమిట్ కవర్ కాదు. దీంతో సీబీడీటీ కొత్త రూల్ అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి భారీగా ఆర్థిక లావాదేవీలు చేసేవారికి కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. ఈ రూల్ ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ వెల్లడించాలి.
ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రమే కాదు కో-ఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసినా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరికీ పాన్ కార్డ్ లేదు. మరి అలాంటివారి పరిస్థితి ఏంటన్న సందేహాలు ఉన్నాయి. పాన్ కార్డ్ లేనివారు తమ ఆధార్ నెంబర్ వెల్లడించాలి. ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని వెల్లడించింది.