రేషన్ వ్యవస్థను కుప్పకూల్చడానికి నగదు బదిలీ అనే పేరు పెట్టి ప్రజలను మాయ చేస్తోంది ఈ ప్రభుత్వం. నగదు బదిలీ పథకం అంటే పేదలకు ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టి చివరకు మొత్తాన్ని రద్దు చేయడం..అసలు నగదు బదిలీ గురించి చెప్పాలంటే రేషన్ కార్డు ద్వారా అందించే నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పు, పంచదార, నూనె మొదలగు వాటి స్థానంలో ప్రభుత్వం నగదును చెల్లించడం అని అర్ధం. ఇలా చేయడం వలన రాబోయే కాలంలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాల్సిన అవసరం ఉండదు. అప్పుడిక ప్రజా పంపిణీ వ్యవస్థతో కూడా పెద్దగా అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అంగీకారం మేరకే నగదు బదిలీని అమలు చేస్తున్నామని చెప్తోంది. ప్రజలకు తీపి కబుర్లు చెప్పి వారిని ఈ దిశగా మళ్లించి తర్వాత అసలుకే మోసం చేస్తుంది. భారతదేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు ఉన్న చరిత్ర చాలా గొప్పది. కరువు వచ్చినప్పుడు , సంక్షోభ సమయాల్లో, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాపంపిణీ ద్వారా పేదలకు ఎంతో లబ్ది చేకూరింది. కానీ ఇప్పుడు
రేషన్ డిపోల్లో ఇచ్చే బియ్యం చాలామంది తినడానికి ఇష్టపడడం లేదని, వాటిని బయట అమ్మేసుకుంటున్నారని ఇదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎగుమతి చేస్తున్న ప్రక్రియను అరికట్టడానికి నగదు బదిలీ పధకాన్ని అమలు చేస్తున్నామని పాలకులు ప్రచారం చేస్తున్నారు. బియ్యం కావాలా , నగదు కావాలా అనే విషయం పై సచివాలయ వాలంటీర్లతో ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టి అంతలోనే ఆపేసింది. పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత మెలికలు పెడుతోందని గ్రహించిన ప్రజలు రేషన్ విషయం లో కూడా ఎదో జరగబోతోందని తెలిసి అప్రమత్తమయ్యేసరికి సర్వేకి బ్రేక్ వేసింది. ఇప్పటికే సరుకులన్నీ సకాలంలో అందడం లేదు. బియ్యం వద్దంటే నగదు ఇస్తామని చెప్తోంది కానీ ఎంత ఇస్తారో ఇప్పటివరకు చెప్పలేదు. కందిపప్పు కిలో రూ.40 నుంచి రూ.67కు రేటు పెంచి, పంచదార ఇచ్చేది అర కిలోనే ఇస్తున్నారు. పామాయిలు అసలు ఇవ్వడమే లేదు. ఇప్పటికే చాలావరకు ప్రజాపంపిణీ వ్యవస్థ ఎత్తేసినట్లే కనిపిస్తోంది . గతంలో ప్రతిపక్షంలో ఉండి ఈ విషయాన్నీ వ్యతిరేకించిన వైసీపీ ఈనాడు సంక్షేమ రాజ్యం ముసుగు కప్పుకుని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరో మాట అని ప్రజలు అంటున్నారు. ప్రజలంతా కలిసి నగదు బదిలీ విధానాన్ని తిరస్కరించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలి. నగదు బదిలీని దశల వారీగా అమలు చేయటం వెనక ఉన్న కుట్రను ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాలి.