రాజు ఉంటేనే కదా రాజ్యంలో పాలన చక్కగా సాగేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయి డిఎమ్ హెచ్ ఓ అనేవారు లేరు. మరి అలాంటప్పుడు కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఏం పని చేస్తారు ? జిల్లాల పునర్విభజన తర్వాత ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల్లో పాలనా కార్యక్రమాలు మొదలయ్యాయి.. కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా అంటే ఎన్టీఆర్ జిల్లాగా, కృష్ణా జిల్లాగా విభజించారు. కానీ కృష్ణాజిల్లాకు మాత్రం పూర్తి స్థాయి జిల్లా వైద్యాధికారి ఇప్పటివరకు లేరు. అసలు విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణాజిల్లా హెడ్ క్వార్టర్ బందరులో ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యకలాపాలన్నీ అక్కడినుంచి జరిగేవి. ఇప్పుడు జిల్లాలు విభజించారు కానీ అధికార విభజన మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. కొత్త డిఎమ్ హెచ్ ఓలను కొత్త జిల్లాలకు కేటాయించారు కానీ పాత జిల్లాకు మాత్రం అడిషనల్ డిఎమ్ హెచ్ ఓను మాత్రమే నియమించి సరిపెట్టేసారు. పూర్తి స్థాయి డిఎమ్ హెచ్ ఓ పోస్ట్ అక్కడ ఖాళీగా పడుంది. ఉన్న ఒకే ఒక్క డిఎమ్ హెచ్ ఓ మాత్రమే రెండు జిల్లాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
రెండు జిల్లాలకు కలిపి ఒక్క డిఎమ్ హెచ్ ఓ మాత్రమే అంటే అది ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఉన్న ఒక్కరు కూడా సిబ్బంది మొత్తాన్ని ఎలా ఒంటి చేత్తో పని చేయించగలరు ? ప్రజలకు ఏదయినా సమస్య వస్తే ఇక్కడ చూసేది ఎవరు ? వాళ్లంతా ఎక్కడి వెళ్ళాలి ? కొత్తగా జిల్లాల విభజన చేస్తున్నా ప్రభుతం అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే అన్ని జరగాలి అనుకునే ప్రభుత్వం అధికార యంత్రాంగ విభజన కూడా జరిగేలా చూసుకున్నాకే విభజన చేసుంటే రోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు . కానీ హడావిడిగా జిల్లాలను విభజించేసి అధికారులను నియమించకుండా ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి చేతులు దులుపుకోవడం అంత హర్షించదగ్గ విషయం కాదు. వెంటనే ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసి పూర్తిస్థాయి డిఎమ్ హెచ్ ఓను నియమించాలి.