ఏపీ సీఎం జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బయటపెట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ మూడేళ్ళ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాడులు – దౌర్జన్యాలు, తప్పుడు కేసులు – అక్రమ నిర్బంధాలు, భూదందాలు-దోపిడీ పాలనపై ఆగ్రహావేశంతో ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీ సహా అన్ని వర్గాలు విసిగిపోయాయి. నియంతలపై ప్రజలు తిరగబడినప్పుడల్లా పలాయనం చిత్తగించడం చరిత్రలో చూశాం. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్ ఇలానే చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘని పరారయ్యాడు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడి పరిస్థితి అదే ఇప్పుడిలా జగన్ రెడ్డి వెళ్లడాన్ని కూడా అదే కోవలో ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ రెడ్డి లండన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలి. అధికారిక పర్యటనల్లో పారదర్శకత పాటించాలి, జవాబుదారీగా ఉండాలి. ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.
సీఎం జగన్ మూడేళ్ళ తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..?
దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ లో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఏ దేశ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరారు. ఏ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కాదా అన్నారు. అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై, ప్రజలపై ఇది అదనపు భారం కాదా అని అన్నారు. విలువైన ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నించారు..
భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. లండన్ కంటే చాలా ముందే దావోస్ వచ్చేస్తుంది. అయినా సరే సీఎం ప్రయాణించే విమానం లండన్‌లో దిగింది. దావోస్ వెళ్లాల్సిన సీఎం లండన్‌లో ఎందుకు దిగారో తెలియడం లేదు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మన రాష్ట్రం గురించి చెప్పి, పెట్టుబడులను ఆకర్షించేందుకు జగన్ దావోస్ వెళ్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఏర్పాట్లు చూసేందుకు కొందరు అధికారులు ముందే అక్కడికి చేరుకోవడం సహజం. మిగిలిన ఉన్నతాధికారులు సీఎంతో పాటే ప్రత్యేక విమానంలో వెళతారు. కానీ శుక్రవారం సీఎం వెళ్లిన ప్రత్యేక విమానంలో జగన్, ఆయన సతీమణితోపాటు ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు సమాచారం !