– కాలంచెల్లిన బస్సులతో అవస్థలు
– నిధులు విడుదల చేయని ప్రభుత్వం
– టికెట్ ధరలను పెంచిన ఆర్టీసీ
ఆర్టీసీ పరిస్థితి రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. ఎర్రబస్సు ఒకప్పుడు పల్లెటూళ్లకు చక్కని సేవలు అందించింది.. కానీ ఇప్పుడు ఆ ఎర్ర బస్సులకు కాలం తీరింది. దీని కారణంగా ప్రయాణికులు ఈ బస్సుల్లో వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టి కొత్త బస్సులను అందించమని అడుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. కొత్త బస్సులు కొని టైం పాటిస్తే గనక ఆర్టీసీ మళ్ళీ గాడిన పడుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి.
కొత్త బస్సుల కోసం జగన్ సర్కార్ బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించింది. కానీ నిధుల్ని మాత్రం విడుదల చేయలేదు. ఐతే ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా అద్దె బస్సులను తీసుకుని ప్రస్తుతానికి నడిపిస్తోంది. పెట్రోల్ ఖర్చును, డీజిల్ మీద సెస్సుని కలిపి టికెట్ ధరల్ని పెంచేసి ఆ మొత్తం భారాన్ని ప్రజల మీద మోపింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ. 2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 5, హైఎండ్(ఎసి) బస్సులకు రూ.10 చొప్పున డీజిల్ సెస్ పెంచాలని నిర్ణయం తీసుకుంది. డీజిల్‌సెస్ కారణంగా ప్రజలపై ఏడాదికి రూ.720 కోట్ల భారం పడుతుంది. దీని కారణంగా ప్రజలు కూడా పెరిగిన ఆర్టీసీ ధరల పెంపు వలన వాటిల్లో ప్రయాణించడానికి ముందుకు రావడం లేదు. దీని కారణంగా ఈ మూడేళ్ళలో నెలకు 14 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది ఆర్టీసీ.
ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ఆదాయం పెరగాలి.. అలా జరగాలంటే ఆక్యుపెన్సీ పెంచుకుని ప్రజల అభిరుచి తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రయాణ సేవలందిస్తే ఆదరణ పెరిగే అవకాశం ఉంది. నిధులు విడుదల చేయకపోయేసరికి కొత్త బస్సులు కొనే స్థోమత ఆర్టీసీకి లేదని యాజమాన్యం నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త బస్సులను కొని ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలిగితే శుభపరిణామం అవుతుంది. ప్రభుత్వం ఆ విధంగా దృష్టి పెట్టి ఆర్టీసీని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.