– తొలిసారి 3 అమెరికన్ కంపెనీలతో 750 కోట్ల మేర బెరైటీస్ విక్రయాలకు ఒప్పందం
– మరో రూ.250 కోట్ల విలువైన బెరైటీస్‌కు ఒప్పందాలు కుదిరే చాన్స్
అంతర్జాతీయంగా అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలను కలిగివున్న ఆంధ్రప్రదేశ్ లోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ అమెరికా మార్కెట్ లో తన వాటాను పెంచుకోవడంలో విజయవంతంగా తొలి అడుగేసింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రధాన బెరైటీస్ ఎగుమతిదారుగా ఉన్న ఎపిఎండిసి తాజాగా అమెరికన్ మార్కెట్ పై దృష్టి సారించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ విసి&ఎండి విజి వెంకటరెడ్డిలు అమెరికాలో పర్యటించారు. ఇంధన రంగానికి చెందిన కంపెనీల ముఖ్య కార్యాలయాలు అధికంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ లో పలు సంస్థలతో భేటీ అయ్యారు. ఆయా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ లోని మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేస్తున్న బెరైటీస్ పై అవగాహన కల్పించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఎపిఎండిసి ఆధ్వర్యంలో బెరైటీస్ ఉత్పత్తి, ఎగుమతిదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా ఖనిజ సరఫరా, కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ ఎగుమతిదారులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు ఒప్పందాల్లో పారదర్శకతకు అనుసరిస్తున్న విధానాలపై అమెరికన్ కంపెనీలకు వివరించారు. దీనిపై సంతృప్తి చెందిన మూడు కంపెనీలు రానున్న మూడేళ్ళలో సుమారు రూ.750 కోట్ల విలువైన 16 లక్షల టన్నుల బెరైటీస్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి.
అమెరికన్ మార్కెట్ లో ఎక్కువగా సి, డి, డబ్ల్యు గ్రేడ్ బెరైటీస్ కు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు గ్రేడ్ కు సంబంధించి ఇప్పటికే వెలికితీసిన బెరైటీస్ నిల్వలు మంగంపేట ప్రాజెక్ట్ లో దాదాపు 70 లక్షల టన్నుల వరకు ఉన్నాయి. వీటిని తక్షణం అమెరికన్ మార్కెట్ లో విక్రయించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏటా దాదాపు 30 లక్షల టన్నుల బెరైటీస్ ను అమెరికన్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఎక్కువగా మొరాకో, చైనా, మెక్సికో దేశాల నుంచి బెరైటీస్ ఎగుమతులు అమెరికాకు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దేశాలతో ధరల పోటీకి ఎపిఎండిసి సిద్దమైంది. లో-గ్రేడ్ బెరైటీస్ విక్రయం కోసం ధరలను తగ్గించడం ద్వారా అమెరికన్ మార్కెట్ లో ఎపిఎండిసి అతిపెద్ద ఎగుమతిదారుగా అంతరించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటోంది. లో-గ్రేడ్ కు చెందిన నిల్వలను కూడా పూర్తిస్థాయిలో విక్రయిస్తే సంస్థ ఆర్థికంగా మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
”అంతర్జాతీయ మార్కెట్ లో ఎపిఎండిసి ప్రతిష్ట పెరుగుతుంది”
అమెరికాకు చెందిన మూడు కంపెనీలతో బెరైటీస్ విక్రయాలపై ఎంఓయు కుదుర్చుకున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) విసి&ఎండి శ్రీ విజి వెంకటరెడ్డి వెల్లడించారు..ఎపిఎండిసి చరిత్రలోనే తొలిసారి అమెరికాలోని ఇంధన సంస్థలతో ఎపిఎండిసి ఎంఓయు కుదుర్చుకుని, మార్కెటింగ్ రంగంలో కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అలాగే మరో రూ.250 కోట్ల రూపాయల విలువైన బెరైటీస్ కొనుగోలుకు ఎంఓయులు కుదిరే అవకాశం ఉందని అన్నారు. వివిధ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న బెరైటీస్ తో పోలిస్తే మంగంపేట నుంచి అందించే ఖనిజం నాణ్యత, ధరల్లో వ్యత్యాసం, పారదర్శకమైన ఎగుమతి విధానంపై పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కంపెనీలు కూడా బెరైటీస్ కోసం సంప్రదింపులకు సిద్దమయ్యాయని వెల్లడించారు. లో గ్రేడ్ బెరైటీస్ కొనుగోళ్ళలో అమెరికా అతిపెద్ద మార్కెట్ గా ఉందన్నారు. మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేసే బెరైటీస్ లో లో-గ్రేడ్ ఖనిజాన్ని అమెరికా మార్కెట్ లో విక్రయించడం, క్రమంగా ఇక్కడ మార్కెట్ ను విస్తరించుకోవడం వల్ల ఎపిఎండిసికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే నేరుగా అమెరికన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై, బెరైటీస్ ఎగుమతుల ఒప్పందాలను కుదుర్చుకోవడం వల్ల ఎపిఎండిసి ప్రతిష్ట అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతుందన్నారు.