ఆంధ్రప్రదేశ్‌లోని చాలా గ్రామాల్లో రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవిచడం ఆనవాయితీ. కరవు ప్రభావిత ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ చాలామంది పశువుల పోషణే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని బతుకుతుంటారు. వ్యవసాయానికి అనుగుణంగా భూములు ఉన్నా అవి పూర్తిగా వర్షాధార ప్రాంతం కావడంతో చాలామంది పాడినే ఎక్కువగా నమ్ముకుంటారు. ఐతే జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఏపీ డెయిరీని అమూల్ చేతికి అప్పగించింది. ఇలా ఎందుకు చేసింది అని ప్రశ్నలు ప్రజల్లో తలెత్తాయి.. మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని డెయిరీ సహకార సంఘాలన్నిటిని తన ఫామిలీ మెంబెర్స్ పేరిట అలాగే పార్టీ మిత్రులకు చెందిన ప్రైవేట్ సంస్థలు, ట్రస్టులుగా మార్చేసి వాటిని నాశనం చేశారు. ఐతే తనకు సంబందించిన హెరిటేజ్ గ్రూప్ యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసమే చంద్రబాబు ఇలా చేశారని జగన్ పార్టీకి చెందిన కొందరు నేతలు అప్పట్లో ఆరోపించారు. దేశంలో బాగా పేరున్న సంస్థగా ఎదిగి అత్యధిక మార్కెట్ సామర్థ్యం కలిగిన సంస్థ కాబట్టి అమూల్‌తో ఒప్పందం కుదర్చుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పుడు డెయిరీ ఫార్మ్స్ మీద నిఘాపెట్టగా చాలా విషయాలు బయటపడ్డాయని టీడీపీలోని కొంతమంది చెబుతున్నారు. ఈ జాబితాలో భాగంగానే గుంటూరులోని సంగం డెయిరీ మొదటి స్థానంలో నిలిచింది. దాని చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై అక్రమాస్తుల ఆరోపణలు వచ్చేసరికి ఆయన్ని అరెస్ట్ చేసి డెయిరీని అమూల్‌కు అప్పగించారు. విజయ డెయిరీకి జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ కావాల్సి ఉంది కానీ గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీకి ప్రచారం చేసి అంబాసిడర్‌గా మారారని ధూళిపాళ నరేంద్ర కుమార్ అప్పట్లో ఆరోపించారు.
ప్రజాధనంతో అమూల్‌ను ప్రోత్సహిస్తూనే రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర డెయిరీలను రీమోడిఫై చేసి బలోపేతం చేయాలి. అమూల్‌కు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి రుణం ₹3,000 కోట్లు ఖర్చు పెట్టె బదులుగా, రాష్ట్రంలోని సహకార డెయిరీలు లీజుకు తీసుకుని పాడి రైతులకు కూడా అలాంటి సౌకర్యాలు కల్పిస్తే వారికి కూడా మంచి ప్రయోజనం లభిస్తుంది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ , మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమూల్ కంపెనీ ఉన్నాసరే ఈ ప్రభుత్వాలేవీ అమూల్ పెద్దగా ప్రయోజనాలేవీ కల్పించలేదు. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం అమూల్ ని నెత్తిన పెట్టుకుంది..
ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే గనక తమ తమ లాభార్జన కోసం వ్యాపార వ్యూహాలను అమలు చేసేందుకే అని కూడా స్పష్టంగా అర్ధమవుతోంది. అమూల్ తో ఒప్పందంపై ప్రతి ఒక్కరూ విమర్శించారు . కొంత కాలంగా ప్రభుత్వ సహకార డైరీలు తీవ్ర నష్టాలలో కూరుకుపోయాయి. అందుకు కారణం గత ప్రభుత్వమే అని ఇప్పటి ప్రభుత్వం చెప్తోంది. ఆ నష్టాల ఊబి నుంచి డైరీలను ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం గుజరాత్ కంపెనీకి ఏపీ డెయిరీని ధారాదత్తం చేయడం ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తింది. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా పోటీ ఇచ్చేలా మార్పులు చేయడం కోసమే అమూల్ సహకారం కోరామని పెద్దలు చెప్పినా మన రాష్ట్రంలో అంతకు మించి లాభాలను ఆర్జిస్తున్న ప్రైవేట్ డెయిరీలు కూడా చాలా ఉన్నాయి.
ప్రభుత్వం వాటి సహాయం ఎందుకు కోరలేదు ? ప్రభుత్వం అమూల్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఎవరికి మేలన్నది అంతుచిక్కని ప్రశ్న ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సిన రెండు విషయాలు ఒకటి ఈ-కేంద్రాల వద్ద రైతులు పాలు ఇస్తే ప్రైవేట్ డెయిరీల కన్నా లీటరుకు రెండు రూపాయల ధర ఎక్కువగా ఇస్తారు. ఆ రెండు రూపాయలు కూడా ప్రజాధనం నుంచే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు పాడి రైతుల నుంచి సేకరించిన పాలను అమూల్ సంస్థకు అందిస్తుంది . రైతులు పాలు ఎవరికి పోస్తారన్నది వారి సొంత నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది కాని చేయూత లబ్దిదారులు మాత్రం అమూల్ కేంద్రాలకే పాలు పోయాల్సి ఉంటుందని స్పష్టం కూడా చేసింది. ఇంకో విషయం చెప్పుకుంటే గ్రామాల్లోని రైతులెవరైనా సరే ఈ కేంద్రాలకు పాలు ఇవ్వము అంటే మాత్రం వారికి ప్రభుత్వ పథకాలలో కోత పడుతుందని స్థానిక అధికార పార్టీ నేతలు, సచివాలయ ఉద్యోగులకు అల్టిమేటం కూడా జారీ చేశారు. ఏపీ రైతు సంఘం ప్రతినిధులు కూడా అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించకుండా అమూల్ వంటి సంస్థలకు పెత్తనం అప్పగించిన తీరుపై సందేహాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమూల్ ని ఎలా నడిపిస్తుందో ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న మిగతా డెయిరీలను కూడా ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.