గెలుపోటములతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించింది. అధికార బలానికి, డబ్బుకు లొంగకుండా నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్ట్ గా శశిరేఖ పేరు తెచ్చుకుంటుంది. ఒకసారి ఆమెకు ఓ చారిటబుల్ ట్రస్ట్ పై రైడ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఆ న్యూస్ కవర్ చేయడానికి అక్కడికెళ్తుంది. అయితే అక్కడ అకౌంటెంట్ గా పని చేసే చందు మీరు ఈ న్యూస్ రాయడం వల్ల ట్రస్ట్ కి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. ఎందరో అనాథ పిల్లలు రోడ్డున పెడతారంటూ ఆమెని ఆ న్యూస్ రాయకుండా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ప్రేమకి దారితీస్తుంది. మరోవైపు హవాలా కింగ్ గా ఎదిగిన ఆనంద్ బాలికి చెందిన ముగ్గురు మనుషులు ఓ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయ్యాక వరుస హత్యలకు గురౌతారు. అసలు వాళ్ళు కిడ్నాప్ చేసింది ఎవరిని ? వారి హత్యలకు కారణమేంటి ? 2 వేల కోట్లు కొట్టేసింది ఎవరు ? ఈ మొత్తం వ్యవహారానికి చందు, శశిరేఖకు సంబంధం ఏంటి ? అనేది సెకండ్ హాఫ్ స్టోరీ.
2009 లో వచ్చిన ‘బాణం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన చైతన్య. ఈ 13 ఏళ్ల కెరీర్ లో డైరెక్టర్ గా మూడు చిత్రాలు మాత్రమే చేశాడు. మొదటి రెండు సినిమాలు ‘బాణం’, ‘బసంతి’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాయి. చాలా గ్యాప్ తీసుకొని మరీ సరైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో మూడో సినిమా ‘భళా తందనాన’కి కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చాడు చైతన్య. కానీ ఈ సినిమాతో కూడా చైతన్య సాలిడ్ హిట్ అందుకోవడం కష్టమనే చెప్పాలి. ఫస్టాఫ్ సాదాసీదాగా సాగిపోయింది. కిడ్నాప్, మర్డర్స్, శ్రీవిష్ణు-కేథరిన్ ఫ్రెండ్ షిప్ తో ఫస్టాఫ్ నడుస్తుంది. శ్రీవిష్ణు ఫ్రెండ్ గా నటించిన సత్య కామెడీ ట్రాక్ ఒకట్రెండు చోట్ల తప్ప పెద్దగా నవ్వించదు. ఇంటర్వెల్ వరకు నార్మల్ గా సాగగా ఓ ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండాఫ్ చాలా బాగుంది. ఎందుకంటే అసలు కథ సెకండాఫ్ లోనే ఉంటుంది. 2000 కోట్లు కొట్టేయడానికి వేసే ప్లాన్, పోసాని-సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రమోషన్స్ లో శ్రీవిష్ణు చెప్పినట్లు క్లైమాక్స్ కొత్తగా ట్రై చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉన్న క్లైమాక్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాకి పెద్ద మైనస్ హీరో పాత్రకి జస్టిఫికేషన్ ఇవ్వకపోడం. సినిమా చివరిలో భళా తందనాన సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. బహుశా పార్ట్-2 లో చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రివీల్ చేసి ఉండడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి సీక్వెల్ అవసరం లేదు. ఎందుకంటే కథలో అంతగా బలం లేదు. హీరో పాత్రకి సరైన ముగింపు ఇచ్చి, స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని ఉంటే ఈ సినిమా ఇలా యావరేజ్ అనిపించుకునేది కాదు.