శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భాజపా నేతలపై.. వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. భాజపా నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే.. రక్తం కళ్లజూశారు. విచక్షణారహితంగా దాడి చేసి.. తిరిగి కారులో వెళ్లిపోయారు. ధర్మవరం పట్టణ భాజపా అధ్యక్షుడు రాజు, భాజపా కార్యదర్శి రాము సహా మరొకరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు.ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశానికి సన్నద్ధమవుతుండగా వైకాపా కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా దాడి చేసినట్లు భాజపా నాయకులు చెప్పారు. నిన్న నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డవారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్లకుండా చెక్‌పోస్టులను అలర్ట్ చేశారు.
దాడిని ఖండించిన -సోమువీర్రాజు
ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిన విషయం తెలుసుకుని వరదాపురం సూరితో ఫోన్ లో మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని సూరి సోమువీర్రాజు గారికి ఫోన్ లో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బిజెపి నేత వరదాపురం సూరి పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే ముద్దాయి అని . బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపణ చేశారు. పట్టపగలు పాత్రికేయుల సమావేశంలో ఉండగా మారణాయుధాలతో వచ్చి హత్యకు ప్రయత్నం చేసారని ఈమొత్తం వ్యవహారానికి ఎమ్మెల్యే కారుకుడని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంపై డిఐజి, ఎస్పీ లతో స్వయంగా మాట్లాడిన సోమువీర్రాజు ..దాడి చేస్తానని ఎమ్మెల్యే ముందు గా ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఈతరహా సంఘటన లు ప్రభుత్వం. నిలువరించకపోతే బిజెపి. ప్రత్యక్ష.పోరాటానికి దిగుతుందని సోమువీర్రాజు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
ప్రత్యర్ధులపై రెచ్చిపోయిన కేతిరెడ్డి ?
రాజకీయ ప్రత్యర్థులపై కేతిరెడ్డి ఉగ్రరూపం ప్రదర్శించారు. వైసిపి నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడిన ఆయన ఘాటు పదజాలంతోనే ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ తో పాటు , ఆయన వర్గీయులు గత కొద్ది రోజులుగా కేతిరెడ్డి పై అనేక విమర్శలు చేస్తున్న క్రమంలో కేతిరెడ్డి వారికి గట్టిగానే హెచ్చరికలు చేశారు. ఇప్పుడు బిజెపి లో ఉన్నావ్.టిడిపిలోకి వెళ్తానని ప్రచారం చేసుకుంటున్నావ్.టీడీపీలోకి వస్తే ధర్మవరం నడిబొడ్డున కళాజ్యోతి సెంటర్ లో గుడ్డలుడదీసి కొడతా ‘ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.” మీరు గెలిచినా.ఓడినా అంతా అస్సాం రైలెక్కి కనిపించకుండా పోతారు.నేను ఓడినా, నెగ్గినా ప్రజల మధ్యనే ఉంటా.” వాళ్లు గెలిస్తే ఆరు నెలల్లో నా కాళ్లు చేతులు విరిచేస్తానని చెప్పారు.నన్ను కొట్టి చూడు… పొలిమేర కూడా దాటలేరు ” అంటూ కేతిరెడ్డి సవాల్ విసిరారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని , రోడ్డు వేస్తే కూడా భూకబ్జా అంటారా అంటూ ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.