ఈ వేసవి సీజను ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది . ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదలతో బాటుగా ఆదాయమూ చాలా ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా కరోన మహమ్మారితో వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీకి ఈ పరిణామాలు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచే శుభ శకునాలు ఎదురయినట్లు, జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి రూ.15. 40 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత రెండేళ్ళలో ఎన్నడూ నమోదు కాని ఆదాయం. ఆ తదుపరి సాధారణ రోజుల్లోనూ ఆర్టీసీ సామాన్య ప్రజానీకానికీ, ప్రయాణీకుల అవసరాలకు బాగా దగ్గర కావటంతో ఇక ప్రగతి రధ చక్రాలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చి నెలలలో రోజుకు రమారమి రూ.15.౩౦ కోట్ల ఆదాయం తగ్గకుండా వస్తూనే ఉన్నది.కాగా ఏప్రిల్ నెలలో 3 రోజుల వరుస సెలవుల దృష్ట్యా తేదీ 18.4.22 న రూ.18.62 కోట్లు, అలాగే మే నెలలో 2౩.5.22. న రూ.17.91 కోట్లు, నిన్న అనగా తేదీ.13.6.22 న రూ.18.33 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది.
అంతేకాకుండా టిక్కెట్టేతర ఆదాయ మార్గాలైన కార్గో , పెట్రోల్ బ్యాంకులు, స్టాల్ల్స్, తదితర వాణిజ్య కార్యకలాపాల ద్వారా కూడా ఎన్నో కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ గడిస్తోంది. అలాగే ఏప్రిల్ నెలలో డీజిల్ సెస్ పెంపు ద్వారా అధిక నష్టాల బారి నుండి కొంత మేర ఆర్టీసీ బయటపడగల్గుతున్నది. సెస్ పెంపు వల్ల టికెట్ రేట్లు పెరిగినప్పటికినీ, ప్రయాణికులు సహృదయంతో అర్ధం చేసుకుని ఆర్టీసీ కి సహకరించి మా బస్సులలో ప్రయాణిస్తూ సంస్థ ప్రగతికి మూల కారణమైన ప్రయాణిక దేవుళ్ళందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ కే.ఎస్. బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాబడిలో పల్లెవెలుగు, సూపర్ లగ్జరీ మరియు ఏ/సి బస్సులు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. కాగా ఎక్స్ ప్రెస్ . అల్ట్రా డీలక్స్ వంటి కేటగిరీ బస్సులు ఆదాయ రాబడిలో కొద్దిగా వెనుకబడి ఉన్నాయి. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి ఆ బస్సులలో కూడా రాబడి పెరిగేందుకు మా అధికారులందరూ తగు చర్యలు తీసుకుంటున్నారని కూడా శ్రీ కే.ఎస్. బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కాగా, తేది 12.6.22 న తిరుమలకు లక్షకు పైగా భక్తజనులు రావడం వలన తిరుపతి –తిరుమల మధ్య సాధారణ రోజులలో నడిపే 2౩౦౦-24౦౦ బస్సుల ట్రిప్పుల కన్నా అధికంగా అనగా 2852 బస్సు ట్రిప్పులు నడపడం జరిగింది. దీని ఫలితంగా తిరుపతి జిల్లాలోనే 84% OR తో, ఒక్క రోజులోనే రూ.1.75 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది.
ఇదిలా ఉండగా, తెలంగాణా ఆర్టీసీ జూన్ 9 తేది నుండి దూరప్రాంత సర్వీసులపై రెండవ దఫా డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు మొదలుకొని ఏ/సి సర్వీసుల వరకు అన్నింటిపైనా ఛార్జీలు పెంచింది. సుమారుగా రూ.5 నుండి రూ.170 వరకు కిలోమీటర్ల వారీగా సెస్ పెంచింది. దీని ఫలితంగా తెలంగాణా నుండి దూరప్రాంతాలకు వెళ్ళే బస్సుల టికెట్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి. విజయవాడ, హైదరాబాద్ ల మధ్య తిరిగే బస్సు సర్వీసుల ధరలను పోల్చి చూస్తే టి.ఎస్.ఆర్టీసీ టికెట్ రేట్ల కంటే ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. టికెట్ ఛార్జి తక్కువగా ఉన్నది. దీని వల్ల ఎక్కువమంది ప్రయాణికులు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులు ఎక్కేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీని ఫలితంగా గత 4 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్ళు అన్ని బస్సులకు ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విజయవాడ నుండి హైదరాబాద్ సర్వీసులు రద్దీగా మారాయి. ఓ. ఆర్. తో పాటు ఈ.పి.కే. కూడా బాగా పెరిగి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రయాణికులకు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. చర్యలు కూడా తీసుకుంది. అన్ని సర్వీసులను అందుబాటులో ఉంచి ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
జూన్ 9 నుండి 12 వరకు విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ఆదాయం బాగా పెరిగింది. TSRTC లో సెస్సు పెంపుదలకు ముందు నుంచి, అలాగే, పెంచిన తరువాత ఆదాయ వివరాలలో ఎపీఎస్ ఆర్టీసీ కి గణనీయమైన పెరుగుదల కనిపించింది. విజయవాడ – హైదరాబాద్ మార్గ ఆదాయంలో రోజుకు 4-5 లక్షల వృద్ధి కనిపిస్తోంది.
ఎపీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా పెరిగిన ఆదాయాన్ని చూసి సంబరపడుతున్నారు. తెలంగాణా బస్సు టికెట్ల రేట్లు ఎక్కువగా పెరగటం, ఏపీ బస్సుల టికెట్ రేట్లు పెంచక పోవటం వల్లనే, ప్రయాణీకులు ఎపీఎస్ ఆర్టీసీ బస్సుల ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారని విస్లేస్తిస్తున్నారు. కాగా TSRTC బస్సుల కంటే, APSRTC బస్సుల మెయిన్ టెన్స్ మెరుగ్గా ఉంటుందనే భావన ప్రయాణీకులలో బలంగా ఉండటంవల్ల కూడా, AP బస్సులలో ఆదాయం చాలా ఎక్కువగా పెరుగుతున్నదని కూడా తెలుస్తోంది. అలాగే, ప్రస్తుత వేసవి తాపం వల్ల కూడా AC బస్సులలో ప్రయాణీకుల రద్దీ బాగా పెరిగింది. ఇదే ట్రెండ్ కొన సాగితే, రానున్న రోజుల్లో కూడా ఎపీఎస్ ఆర్టీసీ కి కాసుల పంట పండుతుందని చెప్పవచ్చు. తప్పని పరిస్టితులలో మాత్రమె ఎపీఎస్ ఆర్టీసీ టికెట్ల పై సెస్సు అదీ ఒక్కసారి మాత్రమె పెంచింది. కాని, TSRTC టికెట్ల పై సెస్సు విధించడం ఇది రెండోసారి. అందుకనే, ఇరు రాష్ట్రాల బస్సుల టికెట్ల రేట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఏపీ బస్సులకు లాభ సాటిగా మారింది.
ఇక రానున్న జూలై నెలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలు, కళాశాలలు, తిరిగి ప్రారంభం కానున్న నేపధ్యంలో విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల పెంపుదల, సమయ పాలన వంటి విషయాలలో తగు శ్రద్ధ వహించి వారి మన్ననలను పొందాలని క్రింది అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వబడినవని శ్రీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.