కేశినేని నాని, చిన్నిల మధ్య పోరులో తెలుగుదేశం నష్టపోతుందా? అంత ఎదురుగాలిలోనూ గెలుచుకున్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం చేజారిపోతుందా? ఇవే అనుమానాలు ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో వినపడుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు కేశినేని నాని బలమైన నాయకుడిగా ఉన్నారు. కాని ఆయన తెలుగుదేశం అధినాయకత్వాన్ని సైతం లెక్కచేయకుండా వ్యవహరించడం.. వారికి నచ్చలేదు. అంతే కాదు ఏ క్షణమైనా బిజెపిలోకి వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పైకి మాత్రం రాజకీయాలకే దూరం అంటూ చెప్పుకొస్తున్నారు. ఈసారి తాను పోటీ చేసేది లేదని కూడా చెప్పేశారు. దీంతో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని అభ్యర్ధిగా టీడీపీ ఫైనల్ చేసినట్లుంది. దీంతో చిన్ని యాక్టివ్ గా తిరిగేస్తున్నారు. చిన్ని తెరపైకి వచ్చేసరికి.. దూరం అన్న కేశినేని నాని ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు ఉంది. ఎవరికో ఇస్తే పర్వాలేదు గాని.. తనకు పడని చిన్నికి ఇవ్వడం ఏంటనే కోపంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేశినాని నాని ఈ విషయం సీరియస్ గా తీసుకున్నట్లు కనపడుతోంది. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇది తెలుగుదేశానికి తలనొప్పిగా మారింది.
రేపు చిన్ని ఓటమి కోసం నాని పని చేస్తే.. తెలుగుదేశం ఓడిపోతే ఏంటి పరిస్థితి అనే చర్చ నడుస్తోంది. అసలే ఈసారి ఎన్నికలు ఎవరికీ ఈజీగా ఉండేటట్లు లేవు. పోటాపోటీగా నడిచేట్లు కనపడుతున్నాయ్. వైసీపీ ఇప్పటికీ బలంగానే కనపడుతుంది.. తెలుగుదేశం కాస్త పుంజుకున్నా.. ఢీకొట్టగలిగే శక్తి వచ్చిందా అంటే ఖచ్చితంగా చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్ధుల ఎంపిక కీలకంగా మారనున్నది. ఏ మాత్రం తేడా వచ్చినా అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోతాయని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఇప్పుడు నాని వర్సెస్ చిన్ని వ్యవహారం తెలుగుదేశానికి గండంగా మారుతుందనే అనుమానాలు వస్తున్నాయి. మరి తెలుగుదేశం అధినాయకత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారోనని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఏమైనా పరిస్థితి ఇక్కడిదాకా రావడానికి చంద్రబాబు, లోకేష్ ల వ్యవహారశైలే కారణమనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. సూటిగా చెప్పకుండా.. నానిని కన్విన్స్ చేసుకోకుండా.. ఇలా చిన్నిని తెరపైకి తేవడం వల్ల లేనిపోని కొత్త చిక్కులు వచ్చాయని తెలుగుదేశంలోనే చెప్పుకుంటున్నారు. మరోవైపు చిన్ని మాత్రం యాక్టివ్ గా తిరుగుతూ.. తన గెలుపు ఖాయమనేలా వాతావరణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నానితో విబేధాలున్నా అవన్నీ చిన్నవే అని కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు మాత్రం హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా చిన్నితోనే పని చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.