ఆయన చెప్పాడంటే ఒక లెక్క ఉంటుంది. నిజాలు నిర్భయంగా చెప్పేయడం ఆయనకు అలవాటు. అందుకే ఎప్పుడు ఆయన ఎవరివైపు ఉన్నారో అర్ధం కాక అనుభవజ్ణులు సైతం తికమకపడుతుంటారు. పోలవరం ప్రాజెక్టు మీద అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇద్దరిలో ఎవరు కరెక్టో తేలాలంటే ఇలాంటి మేధావి ఒకరు వచ్చి చెప్పాల్సిందే. పైగా పోలవరం ఆయన జిల్లాకు చెందింది కూడా. అందుకే వచ్చేశారు. చెప్పేశారు. కాని ఆయన వేసిన డైలాగులు మామూలుగా లేవు.
నేను బతికుండగా ఈ పోలవరం పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు. ఈ ఒక్క మాట చాలు గోదావరి ప్రజల ఆవేదన ఎలా ఉందో అర్ధం చేసుకోవడానికి. ఈ ఒక్క మాట చాలు పోలవరం ప్రాజెక్టు ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవడానికి.. ఈ ఒక్క మాట చాలు.. ఆ ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటో ఊహించడానికి. అలాంటి మాట మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
తాను బతికుండగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే ఏళ్లకు ఏళ్లు గడిచిపోవడం తప్ప పోలవరానికి మాత్రం మోక్షం దొరకడం లేదు. పోలవరం నిర్వాసితుల బాధలను, కన్నీళ్లను రోజూ చూస్తుండటం, వినడం తప్ప వారి కష్టాలు తీరే రోజే కనిపించడం లేదు. తీరుతుందన్న నమ్మకమూ రోజురోజుకు పోతోంది. దీంతో వారి కష్టాన్ని తనదిగా మార్చుకున్న ఉండవల్లి .. పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కడిగిపడేశారు.
పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, బావర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ఉండవల్లి క్వచ్చన్ చేశారు. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్ , మంత్రి అంబటి చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అనడం ఎంత వరకూ కరెక్ట్ అని ఉండవల్లి ఫైర్ అయ్యారు. పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది. సెంట్రల్ ఏం చెప్తుంది అనేది వివరంగా శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పడం గవర్నమెంట్ బాధ్యత అని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పిన మంత్రి అంబటి రాంబాబుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ సెటైరిక్ గా అభినందనలు తెలిపారు. తాను బతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని, అసలు పోలవరం డ్యామ్ కట్టలేదు.. డ్యామ్ కట్టకుండానే భద్రాచలం మునిగిపోయిందంటున్నారన్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిపై ప్రధాని మోదీ.. ఈడీ పేరుతో భయపెడుతున్నారని గట్టిగానే చెప్పుకొచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో కాంగ్రెస్ విఫలమైందని అటు హస్తానికీ ఉండవల్లి చురకలు అంటించారు. లోక్ సత్తా అధినేత జయవ్రకాశ్ నారాయణ క్యాప్టిలిజమ్ వల్ల దేశానికి మంచి జరుగుతుందనే కామెంట్లను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. క్యాప్టిలిజమ్‌పై జయప్రకాశ్ నారాయణతో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఉండవల్లి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద చర్చకే దారితీశాయి. మరి దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో.. ఉండవల్లి కోరినట్లు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారో లేదో అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.