సైకిల్ మీద వెళ్లిన పుచ్చలపల్లి సుందరయ్యగారెక్కడ…న్యూడ్ వీడియోలతో దొరికిపోయే ఎంపీ మాధవ్ ఎక్కడ.. తాను నమ్మిన పాలసీలనే అమలు చేస్తూ సైలెంటుగా పని చేసుకుపోయిన పీవీ నరసింహారావు ఎక్కడ…అరగంట చాలు అనే మంత్రి అంబటి రాంబాబు ఎక్కడ.. ఆరోపణ వస్తేనే రాజీనామా చేసేసిన పెద్దలెక్కడ… ఎన్ని వచ్చినా చలనం లేని నేటి మన నేతలెక్కడ. అసలు పోలికనేది ఉందా.. విలువలు పాటించడం అనేది ధర్మంగా చూసేవారు ఒక తరం.. విలువలు పాటించడానికి కష్టపడేవారు తర్వాతి తరం.. ఇక ఇప్పటి తరం అయితే విలువలంటే ఏంటనేదాకా వెళ్లిపోయారు.
ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ అరాచకం వర్షన్స్ మారుతున్నాయి. మనం కూడా 0.1, 0.2 ఇలా పెట్టుకుని చూడాల్సి వస్తుంది. అంత అప్ డేట్ అయిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నేడు ఒక ఎంపీ వీడియో కాల్ లో ఎంత ఘోరంగా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయో చూస్తున్నాం. మంత్రి అయితే అరగంట చాలు అంటూ ఫోన్ మాట్లాడిన ఆడియో వచ్చింది. ఒక మాజీ మంత్రి అయితే మల్లెపూలు తేనా.. అంటూ అడిగిన వీడియో వచ్చింది. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే. బయటికి రాకుండా వందల్లో ఉంటాయనడంలో డౌటే లేదు. ఈ విషయంలో ఒక్క అధికార పార్టీయే కాదు.. అన్ని పార్టీల వాళ్లూ ఉంటారు. కాకపోతే అధికార పార్టీ ఈ విషయంలో కూడా డామినేషన్ చేస్తోంది.
అసలు రాజకీయనేతకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అంటే డబ్బు, హోదానే కారణమని చెప్పాలి. నా దగ్గర డబ్బు ఉంది.. ఎంతైనా విసరగలను.. హోదా ఉంది.. ఎవరైనా తలైనా వంచగలను.. ఇలాంటివే వారిలో అహంకారాన్ని పెంచి.. నిద్రపోయిన హార్మోన్లను లేపుతుంది. మనమేం చేసినా చెల్లుతుంది.. మనమేం చేసినా తప్పించుకోగలం.. ఈ రెండు ఆలోచనలే వారితో ఘోరాలు చేయిపిస్తున్నాయి. పోలీసులు తాము చెప్పిందే వింటూ తలూపుతారు.. ఇంకా కావాలంటే తప్పించుకోవడానికి అవసరమైన సలహాలు ఇస్తారు. ఒకవేళ బయటపడినా ఎలా తప్పించుకోవాలో చెప్పే లాయర్లు ఉన్నారు. ఏం చేసినా.. దండాలయ్యా అంటూ వచ్చే పిచ్చి జనం ఉన్నారు.. ఇంకా వాళ్లకు ఇలాంటి బరితెగింపు లేకుండా ఎలా ఉంటుంది. స్ధలం కనపడితే కబ్జా చేయడమే.. అమ్మాయి కనపడినా కబ్జా చేయడమే.. అడిగేవాడు లేడనే ధీమానే వారితో ఇలా చేయిస్తుంది. అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికి మాత్రం మనసు చలించదు.. అందరూ అలా చేస్తారా? చేయగలరా? అంత ధైర్యం ఉంటుందా? ఉండదు. అందుకే చూసినా పక్కకు పోతారు. కాని రాజకీయ నేతలకు ఉన్న అసాధారణమైన పవర్.. ఇలాంటి తటపటాయింపులు లేకుండా.. తడబాటు లేకుండా మీద పడటానికి అవసరమైన ఎత్తులన్నీ వేస్తూ.. పనయ్యేదాకా వదిలిపెట్టరు. అలాంటి పరిస్ధితుల్లోనే మనం బతుకుతున్నాం.
ఒకప్పుడు మాట తూలడానికి రాజకీయ నేతలు ఆలోచించేవారు.. తర్వాత సబ్జెక్టు పరంగా వాదించుకునేవారు. ఆ తర్వాత విమర్శలు చేసుకోవడం మొదలెటారు. మరి నేటి తరం బూతులు తిడుతోంది. అడ్డగోలుగా వాదిస్తూ అరాచకంగా అల్లరి చిల్లరి మాటలను ప్రయోగిస్తున్నారు. ఎందుకీ మార్పు? అంటే దీనికి ఒక రకంగా మీడియా కారణమని చెప్పొచ్చు. గట్టిగా మాట్లాడితేనే మీడియాలో ఫోకస్ అవుతాం… అలా అగ్రెసివ్ గా మాట్లాడితేనే జనం కూడా మెచ్చుతారు. నిజంగానే ఎక్కువమంది మనోడు ఏం మాట్లాడాడు అంటూ ఆనందపడటం కూడా చూశాం. అలా దావూద్ ఇబ్రహీం, పుష్ప, కేజీఎఫ్ లాంటివాళ్లకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. అందుకే వాళ్లు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఏనాడైతే జనం నిలదీస్తారో.. నువ్వు చేసింది తప్పురా అని మొహం మీదే చెబుతారో.. అప్పుడే వాళ్లు మారతారు. మారకపోతే అలాంటివాడికి ఇదిగో ఈ కారణంతోనే నీకు ఓటు వేయడం లేదు అని చెప్పే ధైర్యం ప్రజలకు వస్తుందో.. అప్పుడు మారతారు. ప్రజలు వీళ్ల అరాచకాలను భరిస్తున్నంత కాలం.. వీరు మారరు. వ్యవస్ధను వాడుకుంటూ.. అన్నీ చేసుకుంటూనే పోతారు. వీళ్లను ఆపాలంటే మాత్రం ప్రజలే ఆపగలరు. ముందు ప్రజలు తమకున్న హక్కులను తెలుసుకుని.. రాజకీయ నేత, పోలీసులు, అధికారులు వీళ్లంతా మనకు సేవ చేయడానికే ఉన్నారు గాని.. పెత్తనం చేయడానికి కాదు అని ఎప్పుడు అర్ధం చేసుకుంటారో.. అప్పుడే మార్పు వస్తుంది.. అందరూ దారిలోకి వస్తారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉందాం.