కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం “బింబిసార”. ఆయన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఒకటే చర్చ . అసలు బింబిసారడు ఎవరు ? ఆయన కథను కళ్యాణ్ రామ్ ఎంచుకోడానికి కారణం ఏమిటి? బింబిసారకు ఉన్న ప్రత్యేకలు ఏమిటి ? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిస్టరీ గురించి తెలిసిన వారికి తప్ప ఈ బింబిసారుడి గురించి చాలా మందికి తెలియదు. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యమైన మగధ రాజ్యాన్ని స్థాపించిన రాజు బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు క్రీస్తుపూర్వం 558లో జన్మించాడు. ఆయన భట్టియా, బింబి దంపుతులకు పుట్టిన కుమారుడు. బింబిసారుడు క్రీ.పూ. 543 లో 15 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించారు. బింబిసారుడు పాలించే కాలంలో భరత ఉపఖండంలో గొప్ప రాజ్యాలైన 16 మహా జనపదాలు ఉండేవి.
ఇందులో కొన్ని స్వతంత్ర రాజ్యాలు కాగా మరికొన్ని రాజవంశీకుల పాలనలో ఉండేవి. వీటితో పాటు నాలుగు పెద్ద రాజ్యాలు ఉండేవి. అవి అవంతి, కోసల, వత్స, మగధ రాజ్యాలు. ప్రస్తుతం భారతదేశంలో దక్షిణ బీహార్ ప్రాంతమే ఒకప్పటి భారత ఉపఖండంలో ఉన్న మగధ రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు మొదట బ్రహ్మదత్త అనే రాజును ఓడించాడు. తన తండ్రి భట్టియా ఓటమికి ప్రతీకారంగా తీర్చుకోవడానికి బ్రహ్మదత్తడి రాజ్యమైన “అంగ” రాజ్యాన్ని స్వాధీనం చేస్తుకున్నాడు. దానికి ప్రతినిధిగా తన కుమారుడు అజాతశత్రువుని నియమించాడు. అలా తన రాజ్యానికి చుట్టుపక్కల గల రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. బింబిసారుడు ఎంతో సమర్థవంతమైన సైనికాధికారి. తన సైన్య పరిధి తెలిసిన అతను తన రాజ్య పరిధిని పెంచుకోవడానికి యుద్ధాల్లో లొంగని రాజ్యాల్లోని వాళ్లకు పెళ్లిళ్లు చేయించు వాటిని ఆక్రమించుకునేవాడు. కోసల రాజు మహాకోసల కుమార్తె, ప్రసేనజిత్తు సోదరి కోసలదేవిని అలానే వివాహం చేసుకున్నాడు బింబిసారుడు. అధికారికంగా ఆయనకు ముగ్గురు భార్యలున్నారని చెప్తున్నా “మహావగ్గ”లో మాత్రం బింబిసారుడికి 500 మంది భార్యలున్నారని చరిత్ర చెప్తోంది. ఇక తనదైన స్టైల్ లో తిరుగులేని పాలన అందించిన బింబిసారుడు చివరకు పదవీ వ్యామోహం కలిగిన కన్నకొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోవడం అనేది ఆయన జీవితంలో ఊహించని ఘటన.